Kanaka Durga temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. గుడిలో కొబ్బరికాయ కొట్టాలంటే ఇరవై రూపాయిలు చేతిలో పెట్టాల్సిందేనని తెగేసి చెబుతున్నారు అక్కడి సిబ్బంది.. కనకదుర్గమ్మ గుడిలో భక్తుల వద్ద నుండి కొబ్బరికాయ కొట్టడానికి 20 రూపాయిలు వసూలు చేస్తున్నారని కాంట్రాక్టర్‌పై మండిపడుతున్నారు భక్తులు.. కాంట్రాక్టర్.. వారానికి లక్షా ఎనిమిది వేల రూపాయలకు టెండర్ పాడుకున్నట్లు తెలుస్తుండగా.. ఆ డబ్బులను భక్తుల వద్ద నుండి దండుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఫిర్యాదు చేసినా.. దుర్గగుడి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు..
సాధారణంగా కొబ్బరికాయ ధరలు రూ.25 నుంచి రూ.30గా ఉన్నాయి.. కానీ, కొబ్బరికాయ కొట్టడానికే భక్తుల నుంచి ఏకంగా రూ.20 వసూలు చేయడం ఏంటి? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.. కొన్ని ఆలయాల్లో కొబ్బరికాయలు భక్తులే స్వయంగా కొట్టుకుంటారు.. మరికొన్ని చోట్ల చిల్లర అడుగుతారు కొబ్బరికాయలు కొట్టే సిబ్బంది.. కొన్ని చోట్ల అది రూ.5 వరకు కూడా ఉండవచ్చు.. చిల్లరలేని సమయంలో.. అది పెరగొచ్చు.. కానీ, ఏకంగా రూ.20 డిమాండ్ చేయడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇక, గతంలో హుండీల లెక్కింపు సమయంలో దొంగతనం చేశాడు కె. పుల్లయ్య అనే వ్యక్తి.. అతని అల్లుడికి ప్రస్తుత కాంట్రాక్టర్ బినామీగా ఉన్నడని ఆరోపణలు ఉన్నాయి.. పబ్లిక్ గా భక్తులు వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నా దుర్గగుడి అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.. అయితే, డబ్బు వసూలు వ్యవహారాన్ని ఓ భక్తుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.