కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన సతీమణి లకుమాదేవి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. కూకట్పల్లి డివిజన్లో చేపట్టిన యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని.. మహిళలు మంగళ హారతులతో దీవించారని అన్నారు. ఈ క్రమంలో బండి రమేష్.. కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చూసి జనం చప్పట్లు కొట్టి అభినందించారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయని బీఆర్ఎస్ పాలన అవసరమా అంటూ బండి రమేషన్ ప్రజలను అడిగారు.
Read Also: 3 Trains on One Track: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాననడం, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి హామీలు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్ పాలనే బంగారమని, కేసీఆర్ బంగారు తెలంగాణ పాలన బూటకమని తేలిపోయిందన్నారు. మాధవరం కృష్ణారావు పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని పట్టుదలగా ఉన్నారని బండి రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. తిరిగి కాంగ్రెస్ పాలన వస్తేనే అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. రూ 500కే గ్యాస్ సిలిండర్, పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు, 18 ఏళ్లు నిండి చదువుకునే యువకులకు ఎలక్ట్రిక్ స్కూటీ, రైతుబంధు సాలుకు రూ.15 వేలకు పెంపు, కౌలు రైతులకు కూడా వర్తింపు, రైతన్నలకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, సబ్సిడిపై సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా వంటి ఎన్నో ప్రయోజనాలు ప్రజలకు కలుగుతాయన్నారు.
నిజమైన అభివృద్ధి కావాలంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని బండి రమేష్ ప్రజలను కోరారు. పార్టీని గెలిపించి ప్రజలకు మేలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డినేటర్ డాక్టర్ సత్యం శ్రీరంగం, సీనియర్ నాయకులు గొట్టు ముక్కల వెంకటేశ్వరావు, నాగరాజు, మహిళా నాయకులు రమాదేవి, సరోజిని, కవిత రమేష్, మధు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.