కాంగ్రెస్ కప్పులో అసమ్మతి తుఫాన్ రేగుతోంది. నిన్న సమావేశమయిన జీ23 నేతలు మరోసారి ఇవాళ కూడా భేటీ అయ్యారు. గంటన్నర పైగా చర్చలు కొనసాగినట్టు తెలుస్తోంది. అజాద్ నివాసంలో అసమ్మతి నేతల సమావేశం ముగిసింది. గులాం నబీ ఆజాద్ నివాసంలో కాంగ్రెస్ అసమ్మతి నేతల సమాలోచనలు కాక పుట్టిస్తున్నాయి.

ఈ సమావేశానికి హజరయ్యారు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, భూపేందర్ సింగ్ హుడా. ఈ రోజు ఉదయం రాహుల్ గాంధీ తో సమావేశమై, ముఖాముఖి చర్చలు జరిపిన భూపేందర్ సింగ్ హుడా ఈ సమావేశానికి వచ్చారు. తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే…లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి జీ23 నేతల భేటీపై మండిపడ్డారు.
ప్రతి కాంగ్రెస్ వాదితో సోనియా గాంధీ చర్చలకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘటితంగా పోరాడాల్సిన తరుణంలో, కొంతమంది నేతలు ( అసమ్మతి నేతలు) పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఉద్దేశాలు సరైనవే అయితే, సోనియా గాంధీతో ఎందుకు మాట్లాడరని అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. ఈ నేతలు (యూపీఏ) ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పుడు, ప్రజాస్వామ్య ప్రక్రియను పరిగణనలోకి తీసుకుని పదవులు ఇవ్వాలని అడిగారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.