Bandi Ramesh: కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పాదయాత్ర నిర్వహించారు. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడటానికి దారితీసిన అతి ముఖ్యమైన కారణాలలో ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైన ఇతర ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధిని అందించాల్సిన అవసరం ఉందని.. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందన్న భావన తెలంగాణగా మారిన జిల్లాల్లో బలంగా, విస్తృతంగా ఉండేదన్నారు. హైదరాబాద్ నగరంలో 1960ల నాటికే ప్రభుత్వ పెట్టుబడులు భారీగా లాభపడ్డాయని.. ఇది 1980ల చివరలో ప్రైవేట్ పెట్టుబడి వృద్ధిని ప్రేరేపించిందన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పెట్టుబడులు, ఉపాధిలో అత్యధిక పెరుగుదల హైదరాబాద్ చుట్టుపక్కల 2004-2009 కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ అంచుకు మాత్రమే పరిమితమైందన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు తెరపైకి రాకముందే హైదరాబాద్‌ను ఐటీ గమ్యస్థానంగా మార్చేందుకు పునాదులు పడ్డాయని బండి రమేష్ అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియమ్మ ఇచ్చిన మేనిఫెస్టో ఇది మా హామీ! అని ఆయన అన్నారు కాబట్టి ఇప్పటి వరకు ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులను అందించామని వాటిని ప్రజలు పూర్తిగా విశ్లేషంచి నమ్మి కాంగ్రెస్‌కే ఓటు వేసేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని బండి రమేష్ పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల కల్లబొల్లి మాటలు నమ్మేవారు లేరని ఆయన పేర్కొన్నారు. ఇంకా బీఆర్‌ఎస్, బీజేపీలను ఎవరూ కాపాడలేరన్నారు. ఈ సందర్బంగా సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ రాజ్‌పుత్ లక్ష్మణ్, ప్రకాష్, నర్సింహా,యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా.. ఆయన మూసాపేట్ డివిజన్‌లో హమాలీ సంఘంతో సమావేశమయ్యారు. కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్‌కు హమాలీ కూలీలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా విచ్చేసిన బండి రమేష్‌కు వారు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు గత పదేళ్లుగా వారి ప్రాంతాల్లో పేరుకుపోయిన సమస్యలను వివరించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అతి త్వరలో అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఒకపక్క కేంద్రం, రాష్ట్రం గత పదేళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి వారి వ్యక్తి గత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో, హమాలీలు తీవ్రంగా , అన్ని విధాలా నష్టపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూకట్ పల్లి ప్రాంత హమాలీలకు కనీస వసతులకు కూడా నోచుకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే గత పాలనలో పీజేఆర్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని హమాలీ సంఘం నాయకులు, కూలీలను ఆయన అభ్యర్థించారు. ఈ సమావేశంలో హమాలీ అధ్యక్షులు నర్సింహా, శంకర్, రాజు, సచిన్, రేష్మా, మేసయ్య, రాఘవేందర్, సంతోష్ హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.