మెదక్ జిల్లాలో కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ ఏజెంట్లు చేస్తున్న అరాచకాలు చాలదన్నట్లు కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు సైతం రైతులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయి.. దెబ్బతింటుంటే.. బ్యాంక్ అధికారులు పుండు మీద కారం చల్లినట్లుగా.. బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు చెల్లించాలని వారి వ్యక్తిత్వాన్ని తూర్పార పడుతున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.. లోన్ కట్టని రైతుల వివరాలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు బ్యాంక్ అధికారులు. పాపన్నపేట కోపరేటివ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న రైతులను.. లోన్ కట్టాలంటూ బ్యాక్ మేనేజర్ రైతులపై ఒత్తిడి తేవడంతో అప్పో సప్పో చేసి కొంతమేర రుణాలు చెల్లించారు రైతన్నలు. అయితే.. అయినా కూడా పెద్దపెద్ద బ్యానర్లు, పోస్టర్లు తయారుచేసి ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాలు, కూడళ్లు, దుకాణాలతో పాటు బాధిత రైతుల ఇళ్లకు పోస్టర్లు కట్టారు బ్యాంక్ అధికారులు.
వాట్సాప్ గ్రూపుల్లోనూ అధికారులు రైతుల పేర్లు సర్క్యులేట్ చేస్తున్నారు. పొలం వేలం వేస్తామంటూ బ్యానర్లు ఊర్లో కట్టడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. నిన్నటి నుంచి ఓ రైతు కనిపించకుండా పోయాడు. నిన్న భూముల వేలం వేస్తున్నట్టు అధికారులు ప్రకటించడంతో.. భూముల వేలం పాటను ఆపాలని రైతులు కోరారు. అయితే.. రైతుల నుంచి వడ్డీ చెల్లిస్తామని బాండ్లు రాయించుకున్న అధికారులు.. రైతుల నుంచి చెక్కులు తీసుకున్నారు. భూముల వేలం పాటను కొన్ని రోజులు ఆపుతామని చెప్పి వెళ్లారు.