CMR College : మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలతో విద్యార్థినులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు నినాదాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపింది. అయితే.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం కళాశాల గేట్లకు తాళం వేసి లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో.. గేటు ఎక్కి దూకి.. లోపలి వైపు వేసి ఉన్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు ఏబీవీపీ మహిళా నేతలు. విద్యార్థినులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని.. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
AP News: తనిఖీ చేస్తుండగా.. కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు!
ఈ ఘటన విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మార్చడంతో, హాస్టల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినిలు హాస్టల్ ప్రాంగణంలో నిరసన చేపట్టి, యాజమాన్యానికి తక్షణం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే.. ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టాం. బాత్‌రూమ్‌ల కిటికీల వద్ద ఫింగర్‌ప్రింట్లు సేకరించి, సాంకేతిక ఆధారాలను అన్వేషిస్తున్నాం. హాస్టల్ సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారు. వారి మొబైల్ ఫోన్లు పరిశీలించి, ఎటువంటి రికార్డింగ్‌లు ఉన్నాయో తెలుసుకుంటాం. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ సంఘటన విద్యార్థినుల భద్రత, ప్రైవసీ పట్ల మేల్కొలిపే చర్చలకు దారితీసింది. సాంకేతికత ఉపయోగం పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను దాడి చేసే ప్రయత్నాలు, సమాజంలో తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.