CM YS Jagan: ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని.. చంద్రబాబుకు ఓటేస్తే నష్టమని.. పథకాలన్నీ ఆపేస్తాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయసు 75 దాటింది, ఈ జీవితంలో వెన్నుపోట్లు మోసాలతో జీవితం గడిచిపోయిందని.. ఇప్పటికైనా ఆయన జీవితంలో పశ్చాతాపం లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఒక్క మంచి లక్షణం కూడా చంద్రబాబులో లేదని విమర్శలు గుప్పించారు. కడప జిల్లాలోని మైదుకూరు ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. వైసీపీ స్కీముల లిస్టు చదువుతూ ఉంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందన్నారు. “అవ్వ తాతలకు ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ… అక్కా చెల్లెమ్మలకు ఆసరా, సున్నా వడ్డీ ఇస్తున్నాం…మహిళలకు రక్షణగా దిశ యాప్… మహిళలకు 50% రిజర్వేషన్…రైతన్నలకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత అందించాం.” అని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు నీ స్కీమ్‌లు ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
Read Also: TDP-Janasena-BJP Manifesto: ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలివే..
మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసావు కదా అయ్యా నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా ఒక్క స్కీమైనా గుర్తుకు వస్తుందా అంటూ ప్రశ్నలు గుప్పించారు. తాను చంద్రబాబును ప్రశ్నలు అడిగినందుకు కొందరికి కోపం వస్తోందని…దత్తపుత్రుడికి కోపం వస్తుంది, వదినమ్మకు కోపం వస్తోందంటూ ఎద్దేవా చేశారు. చంద్రన్న కాంగ్రెస్‌కు కూడా మరో పక్క కోపం వస్తోందని ఆరోపించారు. జగన్‌ను పాతేస్తాను అని కూడా ఆయన అంటున్నారని.. చేతకాని వాడికి కోపం ఎక్కువ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఓ చంద్రబాబు నువ్వు ప్రజలకు చేసిన మంచి ఏమిటి అని అడిగితే నీ వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి అని అడిగితే సమాధానం లేదు అంటూ సీఎం జగన్ తెలిపారు. అందుకోసం నన్ను తిట్టి తిట్టి పెడుతున్నారు.. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశాడా… డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు ఒక్క రూపాయి అయినా రద్దు చేశాడా… అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.