CM YS Jagan: ఎండలను సైతం లెక్కచేయకుండా ఆప్యాయత, అనురాగాలు చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పదిరోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు అని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు అని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని.. ఆయనకు ఓటేస్తే వదల బొమ్మాళీ అంటూ పశుపతిలా బయటకు వస్తాడని విమర్శలు గుప్పించారు. పెన్షన్ల మీదే చంద్రబాబు బృందం గురిపెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు మీరు ఇచ్చిన పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు.. ఇప్పుడు పెన్షన్ మూడు వేలు చేసి ఇంటికి పంపుతుంది ఎవరు అని అడుగుతున్నామని జగన్ ప్రశ్నించారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు చంద్రబాబు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అక్షరాల 66 లక్షల మందికి ఇస్తున్నామన్నారు. పెన్షన్ కూడా నేరుగా ఇంటికే వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు కన్ను పెన్షన్ల మీద పడిందో ఇబ్బందులు వచ్చాయని.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించారన్నారు. కడుపు మంట చల్లారాక వృద్దులు బ్యాంకుల చుట్టూ పెన్షన్ల కోసం తిరిగేలా చేశాడని ఆరోపించారు. చేసిన దౌర్భాగ్యపు పనిని ఒప్పుకోలేక ఆ నెపాన్ని నాపైనే వేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహించారు. దుష్ట చతుష్టయం అంతా కలిసి దారుణమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు.
Read Also: AP ELECTIONS: ఏపీలో ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన
సీఎం జగన్ మాట్లాడుతూ..”58 నెలల కాలంలో మా పరిపాలన మొత్తం మీరు చూశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే పెద్ద మనిషి పెన్షన్ ఇళ్ళకు పంపాడా..ఏ ఒక్క రోజు కూడా అవ్వాతాతల గురించి ఆలోచించారా.. జూన్ 4 దాకా ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసంతకం మీ కోసమే పెడతా.. మేము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు.. ఇది జగన్ మాట.. మీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతీ కుటుంబానికి పెన్షన్ వచ్చే కార్యక్రమం.. మేము అధికారంలో ఉంటేనే పెంచిన అన్నీ పథకాలు.. ప్రతీ విద్యార్థికి డిజిటల్ చదువులు.. ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి.. మీ జగన్ అధికారంలో ఉంటేనే బటన్ నొక్కి పథకాలు.. ఇంటికే పౌర సేవలు.. సంక్షేమ పథకాలు.” అందుతాయన్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు గుర్తొచ్చేది వెన్నుపోటు తప్ప ఏమైనా ఉందా అని అడుగుతున్నామన్నారు సీఎం జగన్. 14 ఏళ్లు ఏమీ చేయని చంద్రబాబు సూపర్ సిక్స్‌లో పెన్షన్ ఎత్తేశారని విమర్శించారు. పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుందన్నారు. 2014లో మ్యానిఫెస్టోలో చంద్రబాబు చెప్పిన ఒక్క హామీ అయినా జరిగిందా అంటూ ప్రశ్నించారు. “రైతుల రుణాలు మాఫీ చేశాడా.. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశారా.. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం అన్నాడు..ఇచ్చాడా.. ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా.. అర్హులకు పక్కా ఇళ్లు అన్నాడు.. ఇచ్చాడా అని అడుగుతున్నా.. సింగపూరుకు మించిన అభివృద్ధి అన్నాడు చేశాడా.. ప్రత్యేక హోదాను కూడా అమ్మేశాడు.. ఇలాంటి వారిని నమ్మొచ్చా.. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసి వస్తున్నారు.. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా.. ఒక్కొకరికి కేజీ బంగారం, బెంజి కారు అంటున్నారు నమ్ముతారా..” అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. ఇలాంటి మోసాలను, రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాలని.. బంగారు భవిష్యత్తు కోసం ఫ్యాను గుర్తుకు రెండు బటన్లు నొక్కాలని సీఎం స్పష్టం చేశారు.