Memantha Siddham Bus Yatra: మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఆరో రోజుకు చేరుకుంది.. సోమవారం రోజు సత్యసాయి జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించింది మేమంతా సిద్ధం యాత్ర.. ఈ రోజు ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా చీకటి మానుపల్లెలోని విడిది కేంద్రం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. మొలకల చెరువు, పెద్దపాల్యం, వేపురి కోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్లకు చేరుకోనుంది బస్సు యాత్ర.. ఇక, సాయంత్రం 3.30 గంటలకు మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో మేమంతా సిద్ధం బహిరంగ సభ నిర్వహించనుంది వైసీపీ.. ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె చేరుకోనున్నారు.. అమ్మగారిపల్లె శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రం దగ్గర రాత్రి బస చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Japan Earthquake : జపాన్ లో బలమైన భూకంపం.. భయంతో వణికిపోయిన జనాలు
కాగా, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ప్రజలు.. బస్సు యాత్ర ఐదో రోజు సోమవారం విజయవంతంగా కొనసాగింది. కిలోమీటర్ల కొద్దీ జనం మండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఇరువైపులా బారులు తీరి స్వాగతం పలికారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలోని బస కేంద్రం నుంచి సోమవారం ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభించారు. బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ మధ్య రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం సహా పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకుని సీఎంకు ఘన స్వాగతం పలికారు. రామాపురంలో బస్సు దిగి సీఎం జగన్ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ముదిగుబ్బకు చేరుకునేలోపే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై బారులు తీరారు. నాగారెడ్డిపల్లి గ్రామస్తులు భారీ గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఇక, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. బస్సుపై నుంచి రోడ్‌షో నిర్వహించిన సీఎం జగన్.. పీవీఆర్ కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కదిరి నుంచి నల్లచెరువు, తనకల్లు మండల కేంద్రాల మీదుగా రాత్రి 10 గంటలకు చీకటివానిపల్లె విడిది కేంద్రానికి సీఎం జగన్ చేరుకున్నారు.