CM YS Jagan Delhi Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్‌రెడ్డి వరుస పర్యటనలతో ఈ వారం అంతా బిజీగా ఉండనున్నారు. మంగళవారం చిత్తూరులో పర్యటిస్తారు. విజయా డైరీ పునరుద్ధరణలో భాగంగా.. అమూల్ సంస్థ ఏర్పాటుచేసే కొత్త యూనిట్‌కు భూమి పూజ చేస్తారు. క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం చేరుకుని.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరతారు. ఈ నెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉంటారు. 5వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. విభజన చట్టం హామీల అమలు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపనున్నారు. 6న ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకుంటారు.
Read Also: PM Narendra Modi: కేంద్ర కేబినెట్‌లో కీలక చర్చ.. మంత్రివర్గ విస్తరణపై సిగ్నల్స్..?
మరోవైపు.. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం జగన్.. కడప జిల్లాలో పర్యటిస్తారు. సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. జులై8న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో ఇడుపులపాయ వెళ్తారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని నిర్వహించనుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించనున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. వాతావరణ బీమా, ఫసల్ బీమా నిధులను రైతుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనల నేపథ్యంలో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లలో అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు.