CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రెండోసారి సీఎంగా ఎన్నిక కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “మొదటిసారి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో మాకు ఓటు వేసారు. కానీ రెండోసారి మాత్రం మాపై నమ్మకంతోనే ఓటు వేస్తారు” అని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి తన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ, “సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. పథకాల అమలులో ఎటువంటి లోటు ఉండదు” అని అన్నారు. “నేను స్టేచర్ (వ్యక్తిగత ఎదుగుదల) గురించి కాదు, స్టేట్ ఫ్యూచర్ (రాష్ట్ర భవిష్యత్తు) గురించి ఆలోచిస్తున్నాను” అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం తమ ప్రభుత్వ ప్రాముఖ్యత అని సీఎం పేర్కొన్నారు.
“25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ అమలు చేశాం.. ఒకే కుటుంబంలో నలుగురు ఉంటే, రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి వరకు ఉంటుంది.. అంతేకాకుండా, మేము కోటి మంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తాం. వారు ఇప్పుడే మాట్లాడకపోయినా, ఓటు మాత్రం మాకే వేస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు.
తన అంచనాలు నిజమవుతాయని, గతంలో తాను చెప్పింది ఎంత నిజమైందో, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. “గతంలో నేను చెప్పిందే జరిగింది. భవిష్యత్తులో నేను చెప్పిందే జరుగుతుంది” అని పేర్కొన్నారు. భారతదేశంలో రాబోయే జనాభా లెక్కలు (Census) & డిలిమిటేషన్ (ప్రాంతాల పునర్విభజన) పై కూడా సీఎం రేవంత్ రెడ్డి విశ్లేషణ ఇచ్చారు.
“2026 నాటికి జనాభా లెక్కలు పూర్తవుతాయి. 2027 లో కేంద్రం వాటిని నోటిఫై చేసే అవకాశముంది.. కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ కోసం సిద్ధమవుతోంది.. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో రెండోసారి ఎన్నికల్లో విజయం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. “నేను పని చేయడాన్ని మాత్రమే నమ్ముతాను. ప్రజల కోసం కృషి చేస్తాను. ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తాను. రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతాను” అని ఆయన స్పష్టం చేశారు.
Off The Record : ఆ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ట్రయల్స్..?