విశాఖ జిల్లాలోని ఆ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో షాడోస్ తయారయ్యారా? కూటమి ఎమ్మెల్యేలు తాము తప్పుకుంటూ… వారసులతో అప్రెంటీస్ చేయిస్తున్నారా? నాలుగేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టారా? ఎవరా ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యేలు? ఏంటా కథ? రాజకీయాల్లో వారసత్వాలు కొత్తేమీ కాదు. కాకుంటే… పెద్దోళ్ళు పవర్‌లో ఉంటే… దాన్ని అడ్డం పెట్టుకుని పిల్లోళ్ళు చెలరేగిపోయినప్పుడే సమస్యలు వస్తుంటాయి. పార్టీల్లో వర్గాలు పెరుగుతుంటాయి. విశాఖ జిల్లాలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందట. మాజీమంత్రి గంటా శ్రీనివాస్, సీనియర్ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు,గణబాబు, విష్ణుకుమార్ రాజు నియోజకవర్గాల్లో వాళ్ళ వారసులు యాక్టివ్ అయిపోయి షాడోలుగా తయారవుతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. అదే సమయంలో సదరు నేతలంతా….నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వారసులతో ట్రయల్స్ వేయిస్తున్నారన్న టాక్ సైతం ఉంది.ఈ దిశగా భీమిలి గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజ మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్ ఆశించారు. అయితే… నో ఫ్యామిలీ ప్యాక్స్, కుటుంబంలో ఒక్కరికే ఛాన్స్ అనడంతో….ఛాన్స్ దక్కలేదు. ఎన్నికల తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా వున్న రవితేజ… ఇటీవల నియోజకవర్గంలో చేస్తున్న హడావిడి చర్చనీయాంశమవుతోంది. గతంలోనే…యువగళం పాదయాత్ర విజయోత్సవ సభలో లోకేష్‌ని ఆకాశానికెత్తే క్రమంలో… తమ నేతకు ప్రధాని అయ్యే క్వాలిటీస్ వున్నాయంటూ ఆస్కార్ లెవల్‌లో రవితేజ ఇచ్చిన పర్ఫార్మెన్స్ విమర్శల పాలైంది. ఆ తర్వాత అడపదడపా కనిపిస్తున్నా…. ఇటీవల యాక్టివిటీ పెంచారట. చంద్రంపాలెం హైస్కూల్లో అధికారిక సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో తానే ఎమ్మెల్యే అయినట్టు టీచర్లు, పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంపై పెద్ద చర్చే జరుగుతోంది భీమిలిలో. అటు బీజెపీ సీనియర్ నేత విష్ణుకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఆయన కుమార్తె శ్యామలా దీపిక యాక్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని కూటమి వర్గాలే చెవులు కొరికేసుకుంటున్నాయి. మేడం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో తానే ఎమ్మెల్యే అయినట్టు బిజీబిజీగా ఉంటున్నారట. ఇక ప్రభుత్వ విప్ గణబాబు స్థానంలో ఆయన వారసుడు యాక్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
విశాఖ పశ్చిమలో పార్టీ పటిష్టంతో పాటు కేడర్ బేస్డ్ గ్రీవెన్స్ నిర్వహించడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారట ఎమ్మెల్యే కుమారుడు మౌర్య. అలా నియోజకవర్గంలో క్రియాశీలంగా మారే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారట ఆయన. సిట్టింగ్ సీట్లో ఫెవికాల్ వేసుకుని కూర్చున్న మరో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సైతం ఇప్పుడు వారసుడి కోసం తాపత్రయపడుతున్నారట. విశాఖ తూర్పు నియోజకవర్గంలోప్రత్యర్థుల తో సంబంధం లేకుండా నాలుగు సార్లు వరుస విజయాలను నమోదు చేశారు వెలగపూడి. ఆయన కుమారుడు ప్రతాప్‌రుద్ర ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఎన్నికల సమయంలో అన్నీ తానే అయి నడిపించిన ఆయన….ఇటీవల కాస్త లో ప్రొఫైల్ లో వున్నట్టు కనిపించినా…..నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తండ్రితో కలిసి ఉన్న ఫ్లెక్సీ లు, స్వాగతం బోర్డు లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో ఎందుకింత హడావుడి అంటే… ప్రిపరేషన్ బాబూ.. ప్రపరేషన్ అంటున్నారు. దీని వెనక లోతైన పరిశీలన ఉందంటున్నారు స్వపక్షం నేతలు. ఎవరు ఎన్ని రీజన్స్ తీసినా… పిల్లలకు పొలిటికల్ కెరీర్ ఇవ్వడం అనేదే కీలకం అంన్నారట సదరు లీడర్స్. ఎన్నికలకు ఆరు నెలల ముందు తెరపైకి తెచ్చి టిక్కెట్లు సాధించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు. ప్రజలను మెప్పించి చట్ట సభల్లో అడుగుపెట్టేయడం కష్టం. అందుకే వారసులతో ఇప్పటి నుంచే అప్రెంటిస్ చేయిస్తున్నారట నలుగురు ఎమ్మెల్యేలు. ఇందు కోసం ప్రత్యేకంగా సలహాదారులు, వ్యక్తిగత కార్యదర్శుల్ని కూడా పెట్టుకుంటున్నట్టు సమాచారం. ఇంకా నాలుగేళ్ళ నాటి ముచ్చట. అప్పటికి ఎవరెలా సక్సెస్ అవుతారో చూడాలంటున్నారు పరిశీలకులు.