CM Revanth Reddy: ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు జయ జయహే తెలంగాణ గీతాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు. ఈ పండుగ రోజు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణ తల్లి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. తమ కుటుంబం కోసమే గత ప్రభుత్వం ఆలోచించిందని విమర్శించారు.
Read Also: Bhatti Vikramarka: ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవం
ఉద్యమ సమయంలో టీజీని యువకులు తమ గుండెలపై రాయించుకున్నారని.. బీఆర్‌ఎస్ టీజీ అని కాకుండా టీఎస్‌గా మార్చిందని సీఎం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్‌ను ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా టీజీగా మార్చిందని వెల్లడించారు. అవినీతి నుంచి అభివృద్ధి వైపు.. తొలి ఏడాది పాలన పూర్తి చేసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గతంలో వివక్షకు గురైన కవులు, కళాకారులను గుర్తించి తగిన విధంగా గౌరవిస్తామని చెప్పారు. జనం కోసం పాట పాడిన గూడ అంజయ్యను తగిన విధంగా సత్కరిస్తామన్నారు. గద్దర్, గోరెటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ వంటి 9 మందిని తగిన విధంగా గౌరవించుకుంటామని.. 9 మందికి కోటి రూపాయల నగదు, ఇంటి స్థలం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణా తల్లికి వివిధ రూపాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్పురిస్తోంది. డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు.. ఒక పండుగ రోజు.. ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నాం. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోంది.. వారికి 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు, తామ్ర పత్రం అందించనున్నాం.. కొంతమందికి బాధ, ఆవేదన, దుఃఖం ఉండొచ్చు. వాళ్ల రాజకీయ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరమని వాళ్లు అనుకోవచ్చు.. కానీ ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో మనం తెలంగాణ సాధించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్నాం.. తెలంగాణలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాం. ఇక అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఉండకూడదని ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాం.”అని సీఎం రేవంత్ అన్నారు.