CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల వరకు తీసుకెళ్లే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కిషన్ రెడ్డి మాటలు వింటుంటే రైల్లో మనకే డబ్బులు పంపినట్టు మాట్లాడుతున్నారు. ప్రజల నుంచి అడిగి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మేము అడుగుతున్నది మీ మోడీ సొమ్ము కాదు, మీ ఆస్తి కాదు. మేము కడుతున్న పన్నులు తిరిగి ప్రజల అభివృద్ధికి వెచ్చించాలి. కానీ, మీరు అడ్డుకోవడం వల్లనే మెట్రో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు” అని వ్యాఖ్యానించారు.
“తెలంగాణకు మెట్రో అవసరమైతే, మీరెందుకు అడ్డుకుంటున్నారు? మీ దగ్గర నిధులు ఉన్నాయా? డిల్లీలో యమున నదిని శుద్ధి చేస్తామని చెప్పే బీజేపీ, తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతోంది. కిషన్ రెడ్డి ‘సైందవ పాత్ర’ పోషిస్తున్నాడు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) కేంద్ర కేబినెట్‌లోకి రాకపోవడం వెనుక మీ ఆటలు ఏంటి?” అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు.
“ఆరేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, తెలంగాణకు ఏ ప్రత్యేక ప్రాజెక్టును తీసుకొచ్చారు? ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పగలరా? మీరే కేంద్ర మంత్రులను ఒత్తిడి చేసి, మెట్రో విస్తరణను అజెండాలో పెట్టొద్దని చెప్పిన విషయాన్ని నిరూపించగలరా?” అని సవాల్ విసిరారు. “తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ పరిశ్రమను గుజరాత్ తరలించారు. అదనంగా తెలంగాణకు ఏ పరిశ్రమను కేటాయించారు? మేము అడిగిన ప్రతీ దానికి బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులను మాదే చెప్తారు. కానీ, కిషన్ రెడ్డి మాత్రం ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అనుకూలంగా మాట్లాడలేరు” అని విమర్శించారు.
“కిషన్ రెడ్డి, కేసీఆర్ చీకటి మిత్రులు. కేసీఆర్ అధికారం పోయిందని బాధపడుతున్నాడు, కిషన్ రెడ్డి అదే బాధతో ఉన్నాడు. తెలంగాణకు రావాల్సిన నిధులను అడ్డుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారారు” అని వ్యాఖ్యానించారు. “బీజేపీ నిజంగా మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే, పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లో ఎందుకు రద్దు చేయడం లేదు? తెలంగాణలో మాత్రమే రద్దు చేయాలని కిషన్ రెడ్డి కోరడం దేనికి సంకేతం? మాదిగల ఉప కులాల విభజన అమలును ఏపీ సీఎం చంద్రబాబుతో చేయిస్తారా? దమ్ముందా?” అని రేవంత్ నిలదీశారు.
“కిషన్ రెడ్డి, నీ ఇంటికొచ్చి వినతిపత్రం ఇచ్చాను. ప్రతీసారి ఎదురుపడినప్పుడు, తెలంగాణ మెట్రో గురించి అడిగాను. తెలంగాణకు రావాల్సిన నిధుల మంజూరు ఎప్పుడు జరుగుతుందో స్పష్టత ఇవ్వండి. బెదిరించి బతికే రోజులు పోయాయి” అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ హామీ ఇచ్చారు – మంచి రోజులు రాబోతున్నాయి, పార్టీకి మంచి జరగబోతోంది అని ధీమా వ్యక్తం చేశారు.
BJP: డీకే శివకుమార్ మరో ఏక్‌నాథ్ షిండే..