BJP: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యవహారం కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. ఆయన బీజేపీకి చేరుతారంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనల్ని డీకే శివకుమార్ కొట్టిపారేసినప్పటికీ, సొంత పార్టీలోని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆయన మహా కుంభమేళాకు వెళ్లడం, శివరాత్రి రోజున కోయంబత్తూర్‌లో మతపరమైన కార్యక్రమానికి హాజరుకావడంతో బీజేపీకి దగ్గరవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
Read Also: Amit Shah: రోహింగ్యా, బంగ్లాదేశీయులే టార్గెట్.. ఢిల్లీపై అమిత్ షా సమీక్ష..
ఇదిలా ఉంటే, కర్ణాటక బీజేపీ డీకే శివకుమార్, ఏక్‌నాథ్ షిండే అవుతారని కామెంట్స్ చేసింది. కాంగ్రెస్‌లో చాలా మంది ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని, డీకే శివకుమార్ అందులో ఒకరు కావచ్చు అని కమలం నేత, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక అన్నారు. కోయంబత్తూరులో జరిగిన ఇషా ఫౌండేషన్ మహాశివరాత్రి కార్యక్రమానికి శివకుమార్ హాజరైన తర్వాత ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇదే కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌లో వర్గపోరు నెలకొందని బీజేపీ ఆరోపిస్తోంది. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలు నెలకున్నాయని చెబుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో నాయకత్వ మార్పు వస్తుందని తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, త్వరలోనే సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కి అవకాశం కల్పించొచ్చని అశోక గురువారం అన్నారు. ఈ ఏడాది నవంబర్ 16న నాయకత్వ మార్పు ఉంటుందని అంచనా వేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే నేత శివకుమార్ అని పేర్కొన్నారు.