తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదని, రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ హడావుడి చేశారన్నారు. కవిత చేసిందంతా ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహా డ్రామా అని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణకు శత్రువులు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కొరివి దయ్యాలని గతంలోనే అన్నాను. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్‌కు కవిత లేఖ అంటూ హడావుడి చేశారు. నేను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ప్రవేశం ఉండదు, రానివ్వను. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి. కిషన్ రెడ్ది, కేసీఆర్ ఒకటే. సమాజంలో అంతరాలు ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుంది. నక్సలిజం రూపాంతరం చెందుతుంది కానీ.. పూర్తిగా అంతరించదు, అంతరించే అవకాశమే ఉండదు. మానవజాతి మనుగడ సాగించినంతవరకు నిక్సలిజం కూడా మనుగడ సాగిస్తుంది’ అని అన్నారు.
Also Read: Anganwadi: తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి.. అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ!
‘రెండు రోజుల్లో మీడియా సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజల ముందుంచుతాను. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారికే పదవులు, బాధ్యతలు. మా ఇంట్లో నేను మినహాయించి ఎవరూ రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. నా సోదరులంతా వాళ్ల వాళ్ల బిజనెస్‌లు చేసుకుంటున్నారు. కవిత చేసిందంతా “అసెంబ్లీ రౌడీ” సినిమా తరహా డ్రామా. కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు భూసేకరణను నేనే క్లియర్ చేశాను’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.