రేపు మధ్యాహ్నం (శుక్రవారం) సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో భాగంగా.. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి తగిన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ దృష్టి పెట్టింది. కాగా.. ఈనెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసాకి ఆమోదముద్ర వేశారు. అలాగే.. ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం – ఎప్పటి నుంచి ఇవ్వాలనే అనే అంశాలపై చర్చించారు. ముఖ్యంగా.. రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతీ ఏటా 12 వేలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని అన్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కి అమెరికా భారీ షాక్.. కీలక హోదాను రద్దు చేయాలని బిల్లు..
ఇదిలా ఉంటే.. ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 95 శాతం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాధలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కర్మచారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
Read Also: Kalki TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ బ్లాక్‍బస్టర్.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇదే