ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణ కులగణనపై పూర్తిగా రాహుల్ గాంధీకి వివరించాను.. పూర్తి శాస్త్రీయంగా కులగణన చేశామని తెలిపారు. తెలంగాణలో బహిరంగ సభ ఉంటుంది, దానికి రావాలని రాహుల్ గాంధీని కోరానని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన ఆదేశాలను ఫాలో అయ్యానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Read Also: Monalisa: కుంభ్ మోనాలిసాకి డైమండ్ నెక్లెస్.. ఇచ్చిందెవరో తెలిస్తే షాక్!
తెలంగాణ రాష్ట్ర కులగణన దేశానికి రోడ్ మ్యాప్.. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. రాజకీయ కోణంలో కాదు ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగిందని అన్నారు. ప్రజలను ఉద్రేకపరిచే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి.. ఎక్కడ లెక్క తప్పలేదు అని వివరించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు తీసుకొస్తాం.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కంటే ముందే.. కేటీఆర్ ఏదేదో చెప్తున్నాడు.. సబిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారని ప్రశ్నించారు.
Read Also: Hyderabad: ప్రియురాలి పేరెంట్స్ వేధింపులకు ప్రియుడు బలి..
‘నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు.. కానీ నా పని నేను చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తనను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనని తెలిపారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను.. అమలు చెయ్యకపోతే అడిగేది నన్నే అని పేర్కొన్నారు. కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. క్యాబినెట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదని.. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలను తాను పట్టించుకోనన్నారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.