నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని, పెద్ద ఎత్తున పేదలకు జకాత్, ఫిత్రా పేరుతో దానధర్మాలు చేస్తారని గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు.
Read Also: Akkineni Nagarjuna: నాగార్జున రేర్ ఫ్యామిలీ ఫోటో.. అఖిల్ ఉన్నంత హ్యాపీగా చై లేడెందుకు..?
రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని గుర్తుచేశారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. వారి సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించి, వారి అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు.
Read Also: CAA Notification: సీఏఏ అమలుపై ఒవైసీతో పాటు ప్రతిపక్ష నేతలు ఏమన్నారంటే?
ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. సోమవారం నెలవంక కనిపించడంతో మంగళవారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు మంగళవారం నుంచి చేపట్టవచ్చని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. లక్నో,ఆగ్రా, కోల్ కతాలో నెలపొడుపు సాయంత్రం 6.52 నిమిషాలకు కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నుంచి మొదలవుతుంది.