CM KCR Speech in Manchirial Public Meeting: సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని మండిపడ్డారు. వికలాంగుల ఫించను మరో వెయ్యి పెంచుతున్నామని సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రకటించారు. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో చక్కటి కలెక్టరేట్లు నిర్మించుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో అవి క్రమంగా సాధించుకుంటున్నామన్నారు. తాగు, సాగు నీటి సరఫరాలో ఇవాళ తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని సీఎం తెలిపారు. అలాగే వరి సాగులో పంజాబ్‌ను కూడా మించిపోయామన్న ఆయన.. యాసంగిలో దేశం మొత్తం కలిపి 94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు. యాసంగిలో తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. ఇప్పటికీ భారత్ వంట నూనెను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. వంట నూనె దిగుమతి తగ్గించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Also: Big Breaking: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. పింఛన్ పెంపు
అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రెండవ విడత గొర్రెల పంపిణీని కూడా ప్రారంభించామని ఆయన వెల్లడించారు.గృహలక్ష్మీ పథకాన్ని కూడా ప్రారంభించుకుంటున్నామన్నారు. 250కిమీ గోదావరిని సస్యశ్యామలం చేసుకున్నామని.. సదాశివ మాస్టారు తలాపునా పారుతుంది గోదావరి అనే పాటను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సింగరేణిది 130 ఏళ్ల చరిత్ర అని.. వాస్తవంగా అది మన సొంత ఆస్తి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో 49 శాతం కేంద్రానికి అమ్మేసిందని.. బీజేపీ సింగరేణిని తాళం వేయాలని చూస్తోందని సీఎం ధ్వజమెత్తారు. బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో పవర్ కట్ ఉందన్న సీఎం.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు దర్జాగా కరెంట్ ఇస్తోందన్నారు. వడ్లు అమ్మితే ఐదారు రోజుల్లో పైసలు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి.. అదంతా ధరణి వల్లేనన్నారు. ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు సులభంగా అవుతున్నాయన్నారు. అయిదు నిమిషాల్లో పట్టా చేతిలోకి వస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భూభాగంలో ఇంచు మించు 99 శాతం ధరణిలో ఉన్నాయన్నారు. రైతు భూమిని ఎవ్వరు మార్చలేరన్నారు.
కాంగ్రెస్ ధరణిని బంగళాఖాతంలో వేస్తానని అంటోందని.. ధరణిని వేస్తారా.. రైతులను వేస్తారా అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు రాదన్న సీఎం.. బాధలు వస్తాయన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే పాత రాజ్యం వస్తుందన్నారు. పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్ని హత్యలు జరిగేవని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ధరణి పోతే దళారీ రాజ్యం వస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ధరణిని బంగాళాఖాతంలో కలిపి వేస్తా అన్న వాళ్లను గిరగిర తింపి బంగాళాఖాతంలో వేయాలన్నారు.