కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్ రావు పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రం తో పాటు దేశంలోని ప్రజా సమస్యల పై గొంతుని వినిపిస్తూ కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని సీఎం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథాలో వీలయినన్ని అన్ని మార్గాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దిశగా బీఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశం అనేక అంశాలను చర్చించింది. కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు తీరని నష్టం వాటిల్లుతున్నదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్ రావు (లోక్ సభ), ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ కవితా నాయక్, పసునూరి దయాకర్, బొర్లకుంట వెంకటేశ్, పోతుగంటి రాములు పాల్గొన్నారు.
Also Read : Kunamneni Sambasiva Rao: మా దేహం బద్ధులైన భారతదేశాన్ని విచ్ఛిన్నం కానియం
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. ‘‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు అభివృద్ధికి ఆటంకాలుగా మారినాయి. ఇది దురదృష్టకరం. దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా అప్పనంగా తమ కార్పోరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారు. తమకు అనుకూల కార్పోరేట్ శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రేమ కురిపిస్తూ లక్షలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్నది. ఎల్ ఐ సి వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెడుతున్నది. వారి కంపినీల డొల్లతనం బైటపడుతూ వారి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతూ లక్షల కోట్ల రూపాయలు వొక్క రోజులోనే నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తున్నది. వారి లాభాలు సంపదంతా నీటిబుడగలేనని స్పష్టమైతున్నది. ఇటువంటి ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రయివేట్ పరం చేస్తూ కేంద్రం తీరని నష్ట చేస్తున్నది. లాభాలను ప్రయివేట్ పరం చేస్తూ…నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతూ..కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్ధిక విధానాల మీద పార్లమెంటు ఉభయ సభల్లో గొంతెత్తాలి. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖంఢించాలె.’ అని ఆయన అన్నారు.
Also Read : Kunamneni Sambasiva Rao: మా దేహం బద్ధులైన భారతదేశాన్ని విచ్ఛిన్నం కానియం