వచ్చే నెల రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సదస్సులు జరిగాయి. మొన్నటి సమావేశాల్లో కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శాఖల వారీగా తమ అభిప్రాయాలను తెలిపారు. తగిన సమయం లేని కారణంగా కలెక్టర్లు తమ అభిప్రాయాలు చెప్పలేకపోయారు.
ఈసారి 36 ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లాల సమాచారంతో ముందుగానే ప్రజెంటేషన్లు సిద్ధం చేయనున్నారు. సదస్సు నిర్వహణకు కనీసం వారం ముందు జిల్లాల కలెక్టర్లకు కార్యదర్శులు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. వీటిల్లోని సమాచారం ఆధారంగా మాట్లాడేందుకు కలెక్టర్లకే ఎక్కువ సమయం ప్రభుత్వం ఇవ్వనుంది. త్వరలో ప్రభుత్వశాఖల అధిపతులతో సీఎం ప్రత్యేక సమావేశం కానున్నారు. ఇందులో కలెక్టర్ల సదస్సులో ఏయే అంశాలపై చర్చ జరగాలన్న దానిపై సమీక్ష నిర్వహిస్తారు. కలెక్టర్ల పనితీరు ఆధారంగా ప్రభుత్వం ర్యాంకింగ్స్ ఇవ్వనుంది.