CM Chandrababu: డ్రోన్ రంగంలో దిశా నిర్దేశం చేసేలా సదస్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి అని డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సమ్మిట్‌లో యువత, విద్యార్థులు ఎక్కువ మంది భాగస్వామ్యం వహించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎగ్జిబిషన్‌ను కళాశాలలు, పాఠశాల విద్యార్థులు ఎక్కువ మంది తలికించే అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేయాలన్నారు. ఏపీని డ్రోన్ రాజధానిగా చేయడానికి ఇవన్నీ ఎలా దోహదపడతాయనే దిశగా కసరత్తు చేయాలన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఐఓటీ, వాట్సాప్‌లను అనుసంధానం చేసుకోవడం ద్వారా రియల్ టైమ్‌లో సమస్యలను పర్యవేక్షించడమే కాకుండా రియల్ టైమ్‌లో పరిష్కారాలు కనుగొనవచ్చన్నారు.
Read Also: Cyclone Alert: ఏపీకి దూసుకొస్తున్న తుఫాను.. ముందస్తుగా చర్యలు
డ్రోన్ల యూస్ కేసెస్‌లో ఎన్నిటిని మనం ఉపయోగించుకోగలమనే దానిపైన ఒక అంచనా ఉండాలన్నారు. ప్రభుత్వంలో ఏఏ శాఖలు ఈ డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశముంది, ఎన్నెన్ని యూస్ కేసెస్ ఉపయోగించుకోవచ్చు అనేదానిపైన ఒక స్పష్టత ఉండాలన్నారు. అవసరమైతే ప్రధానంగా డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశాలున్న శాఖల ఉన్నతాధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)తో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. డ్రోన్ల యూస్ కేసెస్‌లో ఏఐకి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆ దిశగా వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కొన్ని దేశాలు డ్రోన్లను యుద్ధాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నాయన్నారు. మనం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుందామని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. డ్రోన్ల ద్వారా ఇప్పుడు భూసార పరీక్షలు నిర్వహించవచ్చని, పంట ఎంత దిగుబడి వస్తుందో అంచనావేయొచ్చన్నారు. ఎక్కడ పంటకు తెగులు సోకిందో ఇట్టే తెలుసుకుని, పంటంతా మందులు పిచికారి చేయకుండా కేవలం తెగులు సోకిన ప్రాంతంలో మాత్రమే మందులు పిచికారి చేసి వ్యయాన్ని తగ్గించుకోవచ్చన్నారు. దోమల నివారణ, విద్యుత్తు లైన్ల పర్యవేక్షణ, రహదారుల పర్యవేక్షణ ఇలా పలు రంగాలు, పలు విధాలుగా డ్రోన్లను వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.