CM Chandrababu: గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు మాత్రం కచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దీని కోసం గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల జాబితా ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు.. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన.. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం అయ్యారు.. పార్టీ కార్యాలయం వేదికగా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రతి రోజూ ఒకరిద్దరు మంత్రులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.. కార్యకర్తలు.. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. పార్టీకి – ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా చూసుకునే బాధ్యత మంత్రులదే అన్నారు చంద్రబాబు. వ్యక్తిగత దూషణలకు.. భౌతిక దాడులకు దిగకుండా సంయమనం పాటించాలన్నారు.. వైసీపీ తరహాలో టీడీపీ కూడా వ్యవహరిస్తే తేడా ఏముందని ప్రశ్నించారు.
Read Also: Raj Tarun Case : రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్.. ఎంట్రీ ఇచ్చిన మరో అడ్వకేట్ ?
మరోవైపు.. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు… తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప.. నాయకులకు కాదన్నారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు నమస్కరిస్తే.. వారి కాళ్లకు తాను దండం పెడతానని వ్యాఖ్యానించారు.. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. ఇవాళ్టి నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.