పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్యకేసుకు సంబంధించి కోర్టులో విచారణ ప్రారంభమైంది. 23 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. చార్జిషీట్‌లో ముగ్గురు పోలీసు అధికారులను సైతం నిందితులుగా పేర్కొన్నారు. జయరాంను దారుణంగా హత్య చేసిన రాకేశ్‌రెడ్డిని ఏ–1గా చార్జిషీట్‌లో చూపించారు. ఇక ఏ–2 గా విశాల్, ఏ–3గా వాచ్‌మన్ శ్రీనివాస్, ఏ–4గా రౌడీషీటర్ నగేశ్, ఏ–5గా సినీ నటుడు సూర్యప్రసాద్, ఏ–6గా సూర్య స్నేహితుడు కిషోర్, ఏ–7గా రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్‌రెడ్డి, ఏ–8గా మాజీ నేత టీడీపీ బీఎన్ రెడ్డి, ఏ–9గా రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డి, ఏ–10గా నల్లకుంట మాజీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, ఏ–11గా రాయదుర్గం మాజీ ఇన్‌స్పెక్టర్ రాంబాబు, ఏ–12గా ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిని చేర్చారు. మొత్తం 73 మంది సాక్షులను విచారించగా.. 11వ సాక్షిగా శిఖా చౌదరి, 13వ సాక్షిగా ఆమె సన్నిహితుడు సంతోష్‌రావులు ఉన్నారు. హనీట్రాప్‌తో జయరాం హత్యకు కుట్రపన్నిన రాకేశ్‌రెడ్డి జనవరి 31న పిడిగుద్దులు గుద్ది ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలను చార్జిషీట్‌లో జతపర్చారు.
ఆ పోలీసుల సూచనలతోనే..
ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల సూచనతోనే మృతదేహాన్ని నందిగామకు తరలించాడని, జయరాంను చిత్రహింసలు పెట్టి చంపిన రాకేశ్.. ఆ మొత్తం దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడని పేర్కొన్నారు. 11 వీడియోలు, 13 ఫొటోలు తీసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆస్పత్రికి తీసుకువెళ్ల.. ప్లీజ్ అంటూ జయరాం ప్రాధేయపడ్డా రాకేశ్ వినిపించుకోలేదు. ప్రతినెలా 50 లక్షలు ఇస్తా నన్ను చంపకుండా వదిలెయ్ అని మొరపెట్టుకున్నట్లు కూడా తేలింది. పాస్‌పోర్ట్ మీ దగ్గరే పెట్టుకో నన్ను ప్రాణాలతో వదిలేయ్ అంటూ కాళ్లావేళ్లా పడ్డ దృశ్యాలు కూడా సమర్పించారు. వీణ అనే పేరుతో తన ఇంటికి జయరాంను రాకేశ్ లంచ్‌కు ఆహ్వానించారు. అయితే జయరాం శరీరంలో ఎటువంటి విషపదార్థాలు లేవని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది.