ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గనుల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు. తొలుత గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు.
Read Also: Alia Bhatt: ఆలియా భట్ ఆకస్మిక నిర్ణయం.. ఎందుకు ఇలా చేసింది?
ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీ ఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరన్నారు.
Read Also: SLBC Tunnel: కీలక దశకు చేరిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్..
హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా సీఎం అధికారులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమస్యను పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.