Eblu Feo Electric Scooter Launch at Rs 99,999 in India: ‘గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్’ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా ఎబ్లూఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో మూడు డ్రైవింగ్ మోడ్‌లు (ఎకానమీ, నార్మల్ మరియు పవర్) ఉన్నాయి. ఎబ్లూఫియో స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిమీ ప్రయాణం సందిస్తుంది. ఎబ్లూఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,999 ధరతో కంపెనీ విడుదల చేసింది. దీని మోటార్ 110 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగా.. గరిష్ట వేగం గంటకు 60 కిమీ.
రాయ్‌పూర్ ప్లాంట్‌లో ప్రతి నెలా దాదాపు 4,000 యూనిట్లను ఉత్పత్తి చేయగలమని ఎబ్లూఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ సందర్భంగా కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 12,000 నుంచి 15,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) హైదర్ ఖాన్ తెలిపారు. ఈ వ్యాపారంపై ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టామని ఆయన తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఉత్పత్తి అభివృద్ధి, నాణ్యత పెంపుదల మరియు అమ్మకాల మౌలిక సదుపాయాల విస్తరణపై మరో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేశామని చెప్పారు.
Also Read: Amazon Smart TV Offers: అమెజాన్‌లో 54 శాతం డిస్కౌంట్ ఆఫర్.. 10 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీ!
ఎబ్లూఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలతో తమ విక్రయాల నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హైదర్ ఖాన్ తెలిపారు. ‘ఎబ్లూఫియో వాహనంతో ఉత్తమమైన రోడ్డు ప్రయాణం అందిస్తాం. నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదు. సెప్టెంబర్ చివరి నాటికి 50 మంది డీలర్లను కలిగి ఉన్నాము. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 100 మంది డీలర్లను లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఆరు నెలల్లో మరో ఈ-స్కూటర్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ చూస్తోంది. ఒక కుటుంబంలోని సభ్యులందరి అవసరాలకు సరిపోయే విధంగా ఎబ్లూఫియో ఉంటుందని’ అని హైదర్ ఖాన్ పేర్కొన్నారు. బుకింగ్, డెలివరీ వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.