Tamilnadu: తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయ్యారు. సుగంద్ కుమార్‌తో పాటు తల్లి, కుమారుడు మృతి చెందారు. కడలూరు జిల్లా కరమణి కుప్పంలోని ఓ ఇంట్లో 10 ఏళ్ల బాలుడితో సహా ముగ్గురి మృతదేహాలను సోమవారం ఉదయం వెలికితీశామని పోలీసులు వెల్లడించారు. మృతులు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం అందుకున్న నెల్లికుప్పం పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసుల బృందం సంఘటనా స్థలానికి వెళ్లగా, మూడు వేర్వేరు గదుల్లో కాలిపోయిన మూడు మృతదేహాలు కనిపించాయని చెప్పారు.
Read Also: ఎక్స్‌లో 100 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ సెలబ్రిటీలు వీరే!
సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. “పోలీసులు ఇంట్లోకి ప్రవేశించడానికి తలుపులు పగలగొట్టవలసి వచ్చింది. మృతుల ముగ్గురి మృతదేహాలు మూడు వేర్వేరు గదుల్లో కాలిపోయాయి. చుట్టూ కొన్ని రక్తపు మరకలు ఉన్నాయని.. మృతులు ముగ్గురు హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారి తెలిపారు. మృతులను 60 ఏళ్ల కమలేశ్వరి, ఆమె కుమారుడు సుగంద్ కుమార్, పదేళ్ల మనవడిగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న సుగంద్, తల్లిని కలిసేందుకు కొడుకుతో కలిసి కరమణి కుప్పం చేరుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి పొగలు, దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య చేసి తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.