King Charles Coronation: బ్రిటీష్ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో రాజ పట్టాభిషేకం ఇవాళ ఘనంగా జరిగింది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ జరిగింది. ఇప్పటివరకు రాణులు పాలించగా.. తొలిసారిగా ఒక రాజు నాయకత్వం వహించనున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యారు. ఈ వేడుకకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబే వేదిక అయింది. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖుల సమక్షంలో కింగ్ ఛార్లెస్-3 సింహాసనాన్ని అధిష్టించారు. ఆయన సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీటం అలంకరించారు.
నిజానికి.. బ్రిటన్‌లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేక మహోత్సవం జరగడం గమనార్హం. చివరిసారిగా 1953లో ఎలిజబెత్ రాణికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అయితే.. గతేడాది ఆమె కన్నుమూయడంతో కొత్త రాజుగా ఆమె కుమారుడు ఛార్లెస్ నియమితులయ్యారు. ఈ క్రమంలో.. చార్లెస్ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించింది యూకే ప్రభుత్వం. పట్టాభిషేక మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. పట్టాభిషేకం కోసం కింగ్ ఛార్లెస్ దంపతులు సంప్రదాయంగా వస్తు్న్న బంగారు పూతతో చేసిన ప్రత్యేక బగ్గీలో కాకుండా.. ఆధునికీకరించిన డైమండ్ జూబ్లీ స్టేట్ కోచ్ బగ్గీలో బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబేకు చేరుకున్నారు. వెస్ట్ మినిస్టర్ అబేకు వచ్చిన తర్వాత కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ తొలుత కింగ్ ఛార్లెస్‌ను పరిచయం చేశారు. అన్నివైపులా కన్పించేలా నాలుగు దిక్కులా రాజు ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరుగుతుంటే ఈ పరిచయం జరిగింది. అనంతరం చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్ ప్రమాణం చేశారు. తర్వాత చర్చి ఆఫ్ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్ రెండో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక సభికులు ‘గాడ్ సేవ్ కింగ్’ అంటూ ఆలపించారు.
Read Also: Khalistan Commando Chief: ఖలిస్తాన్ కమాండో చీఫ్ పరమ్‌జిత్ పంజ్వార్ హత్య!
ప్రమాణం ముగిసిన అనంతరం సభలో ప్రార్థనలు చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బైబిల్‌లోని కొన్ని వ్యాక్యాలను చదివి వినిపించారు. ప్రార్థనల అనంతరం కింగ్ ఛార్లెస్-3 సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈ సింహాసనాన్ని 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించారు. అనంతరం కింగ్ ఛార్లెస్‌ను జెరూసలెం నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకించారు. అభిషేకం పూర్తయిన తర్వాత ఛార్లెజ్ మహారాజ గౌన్ ధరించి సింహాసనంపై కూర్చున్నారు. ఆ తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే రాజముద్ర, రాజదండంను ఆర్చ్‌బిషప్ ఆయనకు అందించారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ పట్టాభిషేకాన్ని “మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు గర్వకారణం” అని అభివర్ణించారు.