Chandrababu: పామర్రు ప్రజాగళంలో రైతుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త హామీని ప్రకటించారు. రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం కూటమి పని చేస్తుందని.. ఈ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాట ధర లేదు.. ధాన్యం కొనుగోళ్లు లేవు.. కూటమికి వన్ సైడుగా ఓటేయాలని ప్రజలను కోరారు. రైతును రాజుగా చేయడమే తన ఆలోచన అని పేర్కొన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం నీళ్లందివ్వలేకపోతోందని.. సీజన్ మిస్ కాకూడదని పట్టిసీమ తెచ్చామన్నారు.పోలవరం పూర్తి చేయాలి.. నదుల అనుసంధానం కావాలి.. కృష్ణా డెల్టాకు మూడు పంటలకు నీళ్లందించాలని తన కోరిక అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో నేను నీళ్లు పారిద్దామనుకుంటే.. జగన్ కన్నీళ్లు పారిస్తున్నారని విమర్శించారు. పేదరికం లేని సమాజం ఉండాలనేది ఎన్టీఆర్ సందేశం.. అదే తన ఆశయమన్నారు. జగన్‌ది రివర్స్ పరిపాలన అని.. అలాగే ప్రజల జీవితాలను రివర్స్ చేశారన్నారు. రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పెడతామన్నారు. ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేలా పరిశ్రమలు తెస్తామని హామీలు గుప్పించారు. పామర్రులో ఐటీ టవర్ కడతామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
పిల్లలను, యువతను గంజాయి బారిన పడేలా చేస్తోందీ ప్రభుత్వమంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రపంచంలోని అన్ని కంపెనీలను యువత ముందు పెడతామన్నారు. కృష్ణా జిల్లా అనే తులసీవనంలో ఇప్పుడు గంజాయి మొక్కల మొలిచాయన్నారు. ఐదేళ్లల్లో ఒక్కసారైనా అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడారా అంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే భూములకు మంచి ధరలు వచ్చేవన్నారు. గుంతలు పూడ్చలేని జగన్.. మూడు రాజధానులను కడతారంట అంటూ ఎద్దేవా చేశారు. సంపద సృష్టించాలి.. ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలి.. ఇదే టీడీపీ విధానమన్నారు. చిన్న పని చేయాలన్నా.. హైదరాబాదుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. టీడీపీ కంటిన్యూ అయి ఉంటే హైదరాబాదుకు ధీటుగా అమరావతి అభివృద్ది అయ్యేదన్నారు. జగన్ తన పాలనను విధ్వంసంతో మొదలు పెట్టాడని.. వైసీపీ ఇచ్చే ఎంపీ సీటు వద్దని బాలసౌరీ బయటకొచ్చేశారన్నారు. కుమార్ రాజాకు కోట్లు లేవు.. వేసుకునే కోటూ లేదు. కానీ వర్ల రాజాకే దండ వేశానన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా కొనకళ్లకు టిక్కెట్ ఇవ్వలేకపోయానన్నారు. కొనకళ్ల ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదన్నారు.
టిక్కెట్ ఇవ్వలేకపోయినా దేవినేని ఉమ సైనికుడిలా పని చేస్తున్నారన్నారు. ఇలాంటి వాళ్లని తాను మరువగలనా అని పేర్కొన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లను గుండెల్లో పెట్టుకుంటా.. వాళ్లని మరిచిపోగలనా అంటూ తెలిపారు. వైసీపీలో పార్థసారధి ఇమడలేకపోయారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ..”జగనుకు డబ్బున్నోళ్లు కావాలి.. గంజాయి బ్యాచ్ కావాలి.. టీడీపీకి మంచి వాళ్లు కావాలి. ఇవాళ అన్న క్యాంటీన్లు ఉన్నాయా..? ఎస్సీ పథకాలు ఉన్నాయా..?. ఎస్సీలకు అందాల్సిన ఎన్నో పథకాలను రద్దు చేశారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి.. జగన్ తన పేరు పెట్టుకున్నారు. జగవ్ అంబేద్కర్ కంటే గొప్పవాడా..?. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదు. గుడివాడ గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయి.. ఆడపిల్లలను వేధిస్తున్నారు. గంజాయి బ్యాచుపై ఫిర్యాదు చేస్తే.. బాధితుడి పైనే కేసులు పెట్టారు. నా మీదే కేసులు పెట్టారు.” అని చంద్రబాబు పేర్కొన్నారు.