Chandrababu: మనందరి బతుకులు మార్చుకునేందుకు కీలకమైన సమయానికి వచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల జలగ పాలనలో మనకేమైన మిగిలిందా.? మన జీవితాలు బుగ్గి అయిపోయాయన్నారు. అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి.. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం ముందుకు పోతుంటే.. జగన్ పాలనలో రాష్ట్రం రివర్స్ లో వెళ్తోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరు.. ఏ రంగం నష్టపోయిన పర్లేదు.. రైతు నష్టపోతే ఏ దేశం బాగు పడదన్నారు. గోదావరి అనగానే గుర్తుకు వచ్చే అన్నదాత ఇపుడు ఇబ్బందుల్లో ఉన్నాడని.. సాగును చంపేశారని, రైతును ముంచేశారని ఆరోపించారు. డెల్టా ప్రాంతంలో ఎప్పుడు రాని సమస్యలు వచ్చాయి.. రోజుకి ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. 2014లో రైతు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు 12న్నర వెలు ఇస్తాం అన్న జగన్.. 7,500 ఇచ్చి ఊదరగొడుతున్నారన్నారు.
Read Also: YSRCP: వైసీపీకి షాక్.. పార్టీకి, పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ
ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆక్వా రైతులకు రూపాయన్నరకు కరెంట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మూడు పార్టీలు కలిసి వచ్చాం అంటే ఎవరి కోసం వచ్చామో మీరే ఆలోచించుకోవాలన్నారు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుందన్నారు. కేంద్రంలో మళ్ళీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో 160కి పైగా సీట్లు ఎన్డీఏకు రావాలన్నారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని.. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వలేక శవ రాజకీయాలు చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందని విమర్శించారు. తన జోలికి 40ఏళ్లలో ఎవ్వరూ రాలేదు.. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. జాబు రావాలంటే ఎన్‌డీఏ రావాలని.. ఉద్యోగాలు తీసుకువచ్చే దమ్ము జగన్‌కు లేదన్నారు. మెగా డీఎస్సీ పెడతాను.. ఉద్యోగాలు ఇస్తాం గ్యారెంటీ ఇస్తాం.. ఉద్యోగాలు వచ్చేవరకు ఉద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే మండల స్థాయిలో వర్క్ ఫ్రం హోం చేసే అవకాశాలు కల్పిస్తామని, ఇది అసాధ్యం కాదన్నారు. ఆటోమొబైల్ రగం పూర్తిగా నాశనం అయ్యిందన్న ఆయన.. అన్ని రంగాలు నష్టపోయాయన్నారు. మూడు పార్టీల జెండాలు వేరైనా ఎజెండా ఒకటేనన్నారు. మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ తప్ప మరొక ఆప్షన్ లేదన్నారు. నరసాపురం సమస్యల పరిష్కారంతో పాటు పేదలకు రెండు సెంట్లు భూమి ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.