Chandrababu: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.సూళ్లూరుపేటలో టీడీపీ గాలి వీస్తోందన్న ఆయన.. జగన్‌కు ఓటు వేసినందుకు ఆయన ప్రజలను మోసగించారని విమర్శించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం రేయింబవళ్లు పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. జగన్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని.. అన్ని అన్ని నిత్యవసర వస్తువుల ధరలు విద్యుత్ చార్జీలను గణనీయంగా పెంచారని ఆరోపించారు. అభ్యర్థుల ఎంపికను కూడా ప్రజల ద్వారానే చేశామని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో అన్ని వర్గాలూ దెబ్బ తిన్నాయన్నారు.
Read Also: Pithani Balakrishna: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణ
స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కోసమే తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నాయుడుపేట.. సూళ్లూరు పేట ప్రాంతంలో ఎన్నో విదేశీ కంపెనీలను ఇక్కడికి తీసుకువచ్చామని చంద్రబాబు చెప్పారు. శ్రీ సిటీలో కూడా ఎన్నో పరిశ్రమలు వచ్చాయన్నారు. కానీ జగన్ హయాంలో మాత్రం పరిశ్రమలు తరిమేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తిరుపతిలో అమర్ రాజా కంపెనీని తరిమేశారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. తన బ్రాండ్ చూసి కియా, టీసీఎల్ లాంటి కంపెనీలు వచ్చాయని.. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్‌లను తీసుకు వచ్చామన్నారు.
Read Also: CM YS Jagan: లబ్ధి చేకూరింది.. తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాడికి ఎమ్మెల్యే సీటు.. దోపిడీ చేసే వారికి ఎంపీ సీటు జగన్ ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. వైయస్సార్ కంటే తాను ముందుగానే ముఖ్యమంత్రి అయ్యానన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. వాలంటీర్లకు నెలకు 5000 జీతం ఇస్తున్నారని.. బాగా చదువుకున్న వారు జగన్ ట్రాప్‌లో పడవద్దని కోరుతున్నామన్నారు. వాలంటీర్లను తొలగించబోమని హామీ ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. బాగా చదువుకున్న వాలంటీర్లు నెలకు రూ. 50 వేలు సంపాదించే మార్గాన్ని చూపిస్తామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణపైనే మొదటి సంతకం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.