Pithani Balakrishna: ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. ఓ వైపు ఎన్నికల ప్రచారం, మరో వైపు చేరికలతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. బస్సు యాత్ర సందర్భంగా పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పితాని బాలకృష్ణతో పాటు పలువురు జనసేన నేతలు వైసీపీలో చేరారు.
Read Also: YSRCP: వైసీపీలోకి కళ్యాణ దుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు
కాగా, 2014 నుంచి 2019 వరకు ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు పితాని బాలకృష్ణ.. అయితే, 2019లో పితానికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన బాలకృష్ణ.. ఆ వెంటనే జనసేన పార్టీలో చేరారు.. ఇక, గత ఎన్నికల్లో జనసేన తరపున ముమ్మిడివరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగినా విజయం సాధించలేకపోయారు.. అయితే, ఇప్పుడు జనసేన సీటు నిరాకరించడంతో.. తిరిగి సొంత గూటికి చేరారు పితాని బాలకృష్ణ. ఇటీవల జనసేనపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు పితాని బాలకృష్ణ. శెట్టిబలిజలకు ఒకరికి కూడా సీటు ఇవ్వలేదని పార్టీని ప్రశ్నించారు. వన్ కళ్యాణ్ కనీసం కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించారు. ముమ్మిడివరం పొత్తులో టీడీపీకి వెళ్తే రామచంద్రపురం సీటుపై ఆశలు పెట్టుకున్నారు పితాని బాలకృష్ణ. అక్కడ తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగా ఈ రోజు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు పితాని బాలకృష్ణ.
Read Also: CM YS Jagan: లబ్ధి చేకూరింది.. తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి
ఇదిలా ఉండగా.. కళ్యాణ దుర్గం టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు.. అలాగే కంబదూరు, శెట్టూరుకు చెందిన టీడీపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఉమామహేశ్వర నాయుడు ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురై వైసీపీలో చేరారు. గతంలో ఆయన మంత్రి ఉషశ్రీ చరణ్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పోటీకి సిద్ధం కాగా.. టికెట్ దక్కకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ బస్సు యాత్రలో భాగంగా టీడీపీ, జనసేన అసంతృప్త నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.