Chandrababu: సీమలో ట్రెండ్ మారింది.. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెండు తీస్తారు అంటూ హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రజాగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఆయన.. ఈ రోజు కడపలో పర్యటించారు.. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. కడప ఎవరి ఇలాకా కాదు అన్నారు. వైఎస్ జగన్ మీటింగ్ లో బిర్యానీ, క్వాటర్ బాటిల్స్ ఇచ్చారని ఆరోపించారు. మీది వెన్నెల్లో మీటింగ్, మాది ఎండల్లో మీటింగ్.. రాయలసీమ గడ్డ నుంచి ముఖ్యమంత్రికి సవాల్ విసిరుతున్నా.. మీ ఐదు సంవత్సరాల పదవీకాలంలో కడపకు ఏమి చేశారో చెప్పగలరా ? అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు, పులివెందులకు చేసింది శూన్యం.. రెండుసార్లు స్టీల్ ప్లాంట్ కు సీఎం శంకుస్థాపన చేశారు.. నేను సీఎంగా ఉండుంటే ఇప్పటికి ఎప్పుడో స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేవాడిని అని తెలిపారు.
Read Also: Delhi Police: విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య గొడవపై ఢిల్లీ పోలీసులు చేసిన పోస్ట్ వైరల్..
రాయలసీమలో సాగునీరు అందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగేది.. సొంత జిల్లాలో ఏమి అభివృద్ధి చేశావో చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు చంద్రబాబు.. హత్య రాజకీయాలు జగన్ కు తెలుసు అని ఆరోపించిన ఆయన.. సీమలో ట్రెండ్ మారింది.. ఇక వైసీపీకి బెండు తీస్తారు అని హెచ్చరించారు. నందం సుబ్బయ్యను చంపిన భయపడకుండా టీడీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని.. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని టీడీపీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఇక, వైఎస్ జగన్ గెలవకుండా ఉండడానికి, వ్యతిరేక ఓటుచీలకుండా ఉండడానికి, పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నాం.. కడప స్టీల్ ప్లాంట్ తెస్తాం.. వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటించారు.
Read Also: Janasena Party: ఉత్కంఠకు తెర.. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఆ మూడు పెండింగ్
పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం నా కలగా పేర్కొన్నారు చంద్రబాబు.. పోలవరం అదనపు జలాలను రాయలసీమకు మళ్లిస్తామన్న ఆయన.. కడపలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా..? కనీసం పులివెందులలో నైనా వచ్చిందా..? అని నిలదీశారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదని మండిపడ్డారు. నేను కూడా రాయలసీమ బిడ్డనే.. రాయలసీమను రతనాలసీమ చేస్తాను అన్నారు. కులం, మనవాడు అని చూడకుండా ఓట్లు వేయాలి… నేను ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చారు. గంజాయి అమ్మే వాళ్లను భూమిపై లేకుండా చేస్తానన్న ఆయన.. విశాఖలో 25 వేల కేజీల డ్రగ్స్ వచ్చాయి.. ఇంపోర్ట్ చేసిన వారిని సహాయం చేసిన వారిని బొక్కలో వేయాలన్నారు.