బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధికి చిరునామాగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందన్నారు. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాలుగు శాతం రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని ఆరోపించారు. మొత్తం 30 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది.. గతంలో తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం తక్కువకు పడిపోయిందని తెలిపారు. రావణాసురడి వధ జరిగితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని దుయ్యబట్టారు.
ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఎవరు ఇచ్చారు.. ఎన్టీఆర్ కాదా.. మహిళా రిజర్వేషన్లు తెచ్చింది కూడా టీడీపీనే అని అన్నారు. ఇప్పుడు ఆడబిడ్డలకు ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఒక్కో ఆడబిడ్డకు నెలకు 1500 ఇస్తాం.. సంపద సృష్టిస్తాం.. సంపద పెంచుకుంటూ పోయి వారి అభివృద్ధి చేస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ ద్వారా ప్రతీ ఒక్కరి అభివృద్ధి చేస్తామన్నారు. ఒక్కొక్కరికి ఉచితంగా మూడు సిలిండర్లు.. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం.. అందరి భవిష్యత్తు బంగారుమయం చేస్తామని తెలిపారు.
యువతే మాకు ఆస్తి.. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు మూడు వేలు అని చంద్రబాబు తెలిపారు. వర్క్ ఫ్రం హోం తీసుకు వస్తాం.. ప్రతీ మండలంలో రెండు వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం.. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారన్నారు. నేను విజనరీ.. జగన్ రెడ్డి ప్రిజనరీ అని విమర్శించారు. ఇప్పుడు హైదరాబాద్ సింగపూర్ కంటే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని తెలిపారు. యువత భవిష్యత్తు మా భాధ్యత.. పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలా.. గంజాయి భవిష్యత్తు కావాలి ఆలోచించుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.