Chandrababu CID Enquiry: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన్ను ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు దాదాపు 6 గంటల పాటు సీఐడీ చంద్రబాబును విచారించింది. సీమెన్స్ ఒప్పందాలు, లావాదేవీలపై సీఐడీ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పిన ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ టైపిస్ట్‌తో టైప్ చేయించి సీఐడీ నివేదిక సిద్ధం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలతో సీఐడీ విచారణ ముగించింది. చంద్రబాబు విచారణ అంతా సీఐడీ వీడియో రికార్డింగ్ కూడా చేసింది.
Also Read: TS High Court: టీఎస్పీఎస్సీ సమర్పించిన కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు అసహనం
సీఐడీ డీఏస్పీ ధనుంజయుడు నేతృత్వంలో రెండు బృందాలుగా సీఐడీ అధికారులు విచారించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులోని కీలకమైన ఆధారాలు కలిగిన 473 పేజీల పత్రాలు చంద్రబాబు ముందు ఉంచి సీఐడీ బృందం విచారణ జరిపింది. 120 ప్రశ్నాలతో విచారణకు వెళ్లిన సీఐడీ బృందం.. తొలి రోజు చంద్రబాబుపై 50 ప్రశ్నాలు సంధించించినట్లు తెలిసింది. విచారణ అనంతరం సెంట్రల్ జైలు నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కి సిఐడి బృందం వెళ్లింది. రేపు రెండో రోజు చంద్రబాబును సీఐడీ విచారించనుంది. ఈ రోజు మిగిలిన ప్రశ్నలను రేపు సంధించనున్నట్లు సమాచారం.
చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. శని, ఆదివారాలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతించారు. ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలన్నారు. భోజన విరామం గంటసేపు ఉండాలని ఆదేశించారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. విచారణ సందర్భంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని అనుమతించాలన్నారు. చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.