ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌ని ఓడించి.. మూడోసారి ట్రోఫీని అందుకుని రికార్డు సృష్టించింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పరుగుకే ఔట్ అయ్యాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో విరాట్ ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కింగ్ ఔట్ అవ్వగానే ఓ 14 ఏళ్ల బాలిక గుండెపోటుకు గురై చనిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా బాలిక తండ్రి క్లారిటీ ఇచ్చారు.
మార్చి 9న 8వ తరగతి చదువుతోన్న యూపీ చెందిన 14 ఏళ్ల ప్రియాంశి తన కుటుంబంతో కలిసి మ్యాచ్ చూస్తూ గుండెపోటుకు గురై కాసేపటికి మరణించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను ఎంజాయ్ చేసిన ప్రియాంశి.. భారత్ ఇన్నింగ్స్ సమయంలో గుండెపోటుతో కన్నుమూసింది. విరాట్ కోహ్లీ ఒక పరుగుకే ఔట్ అవ్వడంతో ప్రియాంశి చనిపోయిందని నెట్టింట ప్రచారం సాగింది. అయితే ఆ వార్తల్లో ఏ నిజం లేదని బాలిక అంత్యక్రియలు పూర్తయ్యాక ఆమె తండ్రి అజయ్ పాండే తెలిపారు.
‘సంఘటన జరిగినప్పుడు నేను ఇంట్లో లేను. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ అనంతరం మార్కెట్‌కు వెళ్లా. ప్రియాంషి అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ప్రియాంషి మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. నా కుమార్తె మరణంకు, విరాట్ కోహ్లీ అవుట్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇది యాదృచ్చికం మాత్రమే. నా కూతురు కుప్పకూలినప్పుడు విరాట్ ఇంకా క్రీజులోకి రాలేదు’ అని ప్రియాంషి తండ్రి అజయ్ పాండే స్పష్టం చేశారు. ప్రియాంషి తండ్రి వివరణ ఇవ్వడంతో నెట్టింట వచ్చినా పుకార్లకు పులిస్టాప్ పడింది.