AP Bhavan: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీతో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్య నాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి ,రావత్ , హిమాన్షు కౌశిక్ హాజరు కాగా.. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై బుధవారం కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే దేశరాజధానిలోని ఏపీ భవన్ విభజనపై తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించింది. ఐతే తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై గతంలో ఎన్నో మీటింగులు జరిగినప్పటకి ఏ ఒక్క సమస్యా కొలిక్కి రాలేదు. తాజాగా జరిగిన సమావేశంలో మరికొన్ని ప్రపోజల్స్ తెరపైకి వచ్చినట్లు తెలిసింది. దీంతో వచ్చేవారం మరోసారి సమావేశం జరగనుంది.
Read Also: AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
గతంలో కూడా ఏపీ భవన్ విభజనపై సమావేశాలు జరిగాయి. అయితే పంపకాల విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వ్యవహారం సెటిట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరిగింది. ఢిల్లీలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఏపీ భవన్ స్థలాన్ని జనాభా నిష్పత్తిన పంచాల్సి ఉంటుంది. ఇతర ఆస్తులను కూడా ఈ నిష్పత్తి ప్రకారమే పంచేలా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 20 ఎకరాల్లో ఏపీ వాటాగా 58.32 శాతం అంటే 11 ఎకరాలకు పైగా దక్కుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు.