ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. విజయవాడని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు.
‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల బీజేపీ పార్టీ, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనల పైన కూడా బీజేపీ సమావేశంలో చర్చ జరిగింది. తిరుమల ఘటన వ్యవహారంలో హోంశాఖ ఫోకస్ చేసిందని అమిత్ షా నేతలకు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. నోవాటెల్ హోటల్‌లో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేంద్ర హోంమంత్రి కొండపావులూరికి బయల్దేరారు.