స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది దేశ ప్రజలందరికి శుభ సందర్భం అన్న ముర్ము ఈ సంబరాన్ని చూస్తుంటే తన ఆనందానికి అవధులు లేకుండాపోతున్నాయన్నారు. నగరాలు, గ్రామాలలో పిల్లలు, యువత, వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోందన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారని ముర్ము ఆనందం వ్యక్ంచేశారు. ఇక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మహిళా సాధికారత కోసం ప్రయత్నించాలని ముర్ము పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ ఎర్రకోటపై జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మణిపూర్ లో శాంతి స్థాపన, దేశాభివృద్ధిలో యువత పాత్ర, తమ ప్రభుత్వ ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు తదితర విషయాల గురించి మోడీ వివరించారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాన్ని అగ్రగామిగా నిలుపుతామని మోడీ అన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ పాలనలో భారతదేశంలో సూదీ కూడా తయారుచేయలేదని నెహ్రూ పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించారని, ఆటమిక్ ఎనర్జీ ప్లాంటులను కూడా స్థాపించారన్నారు. ఐఐటీలను, ఐఐఎం ల స్థాపనకు కృషి చేశారని కొనియాడారు. ఎర్రకోటలో నిర్వహించిన వేడుకలకు దూరంగా ఉన్న ఆయన ఎక్స్ ద్వారా తన సందేశాన్ని అందించారు.
స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. భారతమాత ప్రతి భారతీయుడి గొంతుక అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఒక నోట్ ను కూడా ఆయన జత చేశారు. తన భారత్ జోడో యాత్ర వీడియోను పంచుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్కొండ వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం లక్ష రూపాయల లోపు ఉన్న రైతుల రుణాన్ని మాఫీ చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తమ ప్రభుత్వ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, వ్యాపార దిగ్గజాలు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.