నిబంధనలు ఉల్లంఘించిన 250కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ వెల్లడించారు. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న వాహనాలు, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బస్సులపై ఇప్పటి వరకు 250 పైగా కేసులు నమోదు చేశారు.
READ MORE: Sabarimala Darshan: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. పంబ వరకు క్యూ లైన్లు
కాగా.. సంక్రాంతి పండగకు ఊరెళ్లే ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్ దోచేస్తున్నాయి. మీరెక్కుతున్నది బస్సే కానీ, విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురుకావచ్చు. సంక్రాంతి పండగ రద్దీని ట్రావెల్స్ ఏజెన్సీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. సాధారణ టికెట్ ధర కంటే మూడింతలు, నాలుగింతలు వసూలు చేస్తున్నాయి. ట్రావెల్స్ దందా చూస్తుంటే బ్లాక్ టికెట్లకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. సాధారణ రోజుల్లో ఛార్జీలకు.. ఇప్పుడున్న ఛార్జీలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. కుటుంబం మొత్తం ప్రయాణించడానికి సరిపోయే ఖర్చు.. కేవలం ఒక్కరి ప్రయాణానికి కూడా చాలని పరిస్థితి నెలకొంది.
READ MORE: Daaku Maharaj: బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ రివ్వూ
సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వాళ్లపై మరింత భారం మోపుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే.. ప్రత్యేక సర్వీసుల పేరిట 50 శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు ప్రయాణికులు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖ పట్నానికి వెళ్లే ఏపీ స్లీపర్ బస్సుల్లో టికెట్ ధర రూ.4 వేలు ఉండేది. ఇప్పుడు రూ.6 వేలకు పై మాటే. అలాగే సాధారణ రోజుల్లో ఏసీ సీటర్ బస్సుల్లో గరిష్టంగా రూ.1849 వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు రూ.5500 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.