CAG Report: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది ప్రభుత్వం.. 2016-2021 మధ్య పలు అవకతవకలను జరిగినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2015-20 మధ్య కాలంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర గ్రాంట్లలో 129 కోట్ల తగ్గుదల.. 2016-18 మధ్య కాలంలో పని తీరు గ్రాంటులో 28.93 కోట్లకు కోత పడిందని తెలిపింది. తాడిపత్రి, శ్రీకాళహస్తి, పుంగనూరు, అద్దంకి మున్సిపాలిటీలను వాటి అర్హతకు తగినట్లు పెంచలేదు అని కాగ్ గుర్తించింది. 2016-22 మధ్య కాలంలో 2022 లేబర్ సెస్ కింద 55.39 కోట్ల వసూలు చేశారని.. వసూలు చేసిన 55.39 కోట్లను ఏపీ భవన కార్మికుల సంక్షేమ బోర్డుకు బదిలీ చేయలేదని కాగ్ పేర్కొంది. రాజధాని కోసం భూసేకరణ పై గత ప్రభుత్వ తీరును ఎండగట్టిన కాగ్.. రాజధాని కోసం భూసేకరణ లో నిపుణుల కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొలేదని తేల్చింది. రాజధానికి అవసరమైన మొత్తం భూమిలో 70 శాతం భూ సమీకరణ ద్వారా సేకరించాలనే నిర్ణయం వల్ల భారీ ఆర్థిక భారం పడిందని ఎత్తిచూపింది కాగ్ నివేదిక..
Read Also: 2000 Notes Exchange: 2000 నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే సమయం.. త్వరగా మార్చుకోండి
అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల వల్ల నిధులు నిరుపయోగంపై ప్రస్తుత ప్రభుత్వ తీరును తప్పు బట్టింది కాగ్ రిపోర్ట్.. 2019 మే నుంచి వివిధ పనులను నిలిపి వేశారన్న కాగ్.. దీని వల్ల ఈ పనుల కోసం ఖర్చు చేసిన రూ.1505 కోట్లు నిరుపయోగం అయ్యాయని తెలిపింది. జలవనరుల పరిధిలో ప్రజా వేదికను నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా కట్టారు.. ఆ తర్వాత దీన్ని కూల్చివేయటం వల్ల రూ. 11.51 కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని పేర్కొంది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించటానికి కన్సల్టెంట్ల ఎంపికలో తగిన విధానాన్ని అనుసరించ లేదని దుయ్యబట్టింది. నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేయటాన్ని తప్పు బట్టిన కాగ్ .. భూ సమీకరణ కోసం ఏపీ సీఆర్డీఏ రూ.2,244 కోట్లు ఖర్చు చేసింది.. సేకరించిన ఈ భూమి నిరుపయోగంగా ఉందని విమర్శించింది.
విశాఖలో 876 పరిశ్రమల్లో 70 పరిశ్రమలు సరైన అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు కాగ్ గుర్తించింది.. అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.13,802 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదన ఉండగా.. దీనిలో 2021 నాటికి రూ.183 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు కాగ్ గుర్తించింది. ప్రాధాన్యం ఉన్న మౌలిక సదుపాయాల ప్యాకేజీల కోసం రూ.3,213 కోట్ల ఖర్చు చేశారు.. 2019 మే తర్వాత ఈ పనులన్నీ నిలిచి పోయాయని తన నివేదికలో పేర్కొంది కాగ్.