Business Headlines 27-02-23:
ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా లేదు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటుందని, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానెటరీ పాలసీ కమిటీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ అన్నారు. ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉండటం వల్ల అంచనాల కన్నా తక్కువగానే నమోదవుతుందని తెలిపారు. వడ్డీ రేట్లు పెరగటం వల్ల ఆ ప్రభావం ఈఎంఐలపై పడి ఫ్యామిలీ బడ్జెట్ తగ్గుతుందని చెప్పారు. చివరికి ఖర్చులు సైతం తగ్గుతున్నాయని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లలోని పరిస్థితుల కారణంగా ఎగుమతులు దెబ్బతింటున్నాయని ఆర్‌బీఐ ఎంపీసీ మెంబర్ జయంత్ ఆర్ వర్మ్ వివరించారు.
చాట్‌జీపీటీ.. ఆల్టర్నేటివ్ కాదు
చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లు ఉద్యోగులకు ప్రత్నామ్నాయం కాబోవని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తెలిపింది. అవి.. ఉద్యోగులకు కొలీగ్స్‌లాగా మాత్రం వ్యవహరించగలవని అన్నారు. ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు ఈ కృత్రిమ మేధను వినియోగించుకోవచ్చని సూచించారు. చాట్‌జీపీటీల వల్ల భవిష్యత్తులో మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల పనితీరుకు సంబంధించి పూర్తి స్పష్టత రావటానికి రెండేళ్లు పడుతుందని అంచనా వేశారు. చాట్‌జీపీటీలపై సర్వత్రా చర్చ జరుగుతున్న సమయంలో 6 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న టీసీఎస్ ఇలా స్పందించటం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిలిచిపోయిన 50 విమానాలు
వస్తు ఉత్పత్తుల సరఫరా సమస్యలు మరింత పెరిగాయి. ఇంజన్ సమస్యల వల్ల ఇండిగో మరియు గోఫస్ట్ విమానాలు 50 దాక నిలిపోవటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న విమానాల లీజును పొడిగించటం, కొత్త విమానాలను ఈ రంగంలోకి తీసుకురావటం వంటి మార్గాలను అన్వేషిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూలంగా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తలెత్తటం తెలిసిందే. దీనివల్ల కొంతకాలంగా ప్రాట్ మరియు విట్నీ ఇంజన్ సమస్యలు ఎదురవుతున్నాయి.
ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లతో..
కంపెనీల కస్టమర్ కేర్ నంబర్‌ల కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారా?. అయితే.. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ కస్టమర్ కేర్ నంబర్ సరైందో కాదో ఆయా సంస్థల వెబ్‌సైట్లలోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. లేకపోతే.. మీరు మోసపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. కేటుగాళ్లు.. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను సృష్టిస్తున్నారు. వాటినే సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్నారు. దీంతో వినియోగదారులు పొరపాటున ఆ నంబర్లే కరెక్ట్ అనుకొని ట్రాప్‌లో పడిపోతున్నారు. ఇలాంటి నంబర్లు మొత్తం 31 వేల 179 ఉండగా మన దేశంలో 17 వేల 285 ఉన్నాయని సైబర్ ఇంటలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ వెల్లడించింది.
లిథువేనియా దేశ కాన్సులేట్..
యూరప్ దేశమైన లిథువేనియా.. హైదరాబాద్‌లో గౌరవ కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. గౌరవ కాన్సుల్‌గా దివిస్ ల్యాబ్స్‌కి చెందిన కిరణ్ సత్‌చంద్ర దివీని నియమించింది. ఈయన రెండు తెలుగు రాష్ట్రాలకు గౌరవ కాన్సుల్‌గా ఉంటారు. లిథువేనియా దేశానికి మన దేశంలోని ఢిల్లీలో రాయబార కార్యాలయం ఉండగా ముంబై, కోల్‌కతా, బెంగళూరుల్లో గౌరవ కాన్సుల్ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అందుబాటులోకి రావటం విశేషం. ఈ సందర్భంగా కిరణ్ దివీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతపరంగా అగ్రగామిగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో తన నియామకం వల్ల లిథువేనియా కంపెనీల సంఖ్య పెరుగుతుందన్నారు.
డిజిటల్ రంగం షేరు.. జోరు
స్థూల దేశీయోత్పత్తి వృద్ధిలో డిజిటల్ రంగం వాటా మరో నాలుగైదేళ్లలో పావు శాతానికి చేరుతుందని ప్రముఖ ఆర్థికవేత్త కేవీ కామత్ అంచనా వేశారు. ఈ వాటా ప్రస్తుతం నాలుగు శాతంగానే ఉంది. అంటే.. 3 పాయింట్ 3 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. ఇది 2028-29 నాటికి 7 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని దాటుతుందని అన్నారు. రానున్న రోజుల్లో డిజిటల్ మౌలిక వసతులు, ఇ-కామర్స్, డిజిటల్ పేమెంట్స్, సర్వీసులు పెరగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జీడీపీలో డిజిటల్ సెక్టార్ షేర్ పెరగటానికి ఇది ప్రధానంగా దోహదపడతాయని కేవీ కామత్ వివరించారు.