Kadiyam Srihari: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందని స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. కల్లబొల్లి మాటలతో , మోసపూరిత హామీలతో తెలంగాణ రైతులను ఆగం చేస్తుంది కాంగ్రెస్ అంటూ ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కడియం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇస్తామని గొప్పలు చెబుతున్నారే తప్ప.. మోసపు హామీలు ఇస్తూ వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇవ్వడం లేదన్నారు.
Also Read: Balka Suman: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ న్యాయం చేయలేదు..
అమెరికాలోని తానా సభలో రేవంత్ రెడ్డి తెలంగాణలో కరెంటు దుర్వినియోగం అవుతుందని, మూడు గంటల కరెంటు సరిపోతుందన్నాడని కడియం శ్రీహరి ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో రైతులకు ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని బహిరంగ సభలలో స్వయంగా డీకే శివకుమార్ చెప్పాడని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలను ప్రజలు నమ్మొద్దన్నారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పే ప్రయత్నం చేయదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దోచుకొని దాచుకుంటుందని కడియం శ్రీహరి ఆరోపించారు.