సిద్దిపేట చిన్న కోడూరులో గౌడ కమ్యూనిటీ హల్‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీళ్ళు లేక పంటలు ఎండిపోతుంటే ఇక్కడ ఎండాకాలంలో చెరువులో నీళ్లు ఉన్నాయంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వల్లనే అని ఆయన అన్నారు. గతంలో 30 ఏండ్ల వరకు ప్రాజెక్ట్ లు పూర్తి కాకపోయేటివి… కాని కెసిఆర్ హయాంలో 4 ఏళ్లలో ప్రాజెక్ట్ లు పూర్తి చేశామన్నారు. కేసీఆర్ వచ్చాక గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేశాం, వైన్స్ టెండర్ల లలో గీత కార్మికులకు రిజర్వేషన్లు తెచ్చామన్నారు హరీష్ రావు.
ఇదిలా ఉంటే.. నిన్న సిద్దిపేట రైతులను తక్షణమే ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరుతూ హరీష్ రావు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతుంగానికి సాగు నీళ్లు అందించాలని కోరిన హరీష్ రావు.. రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి సారించాలన్నారు. కాలువలు రాకపోవటం వలన, నీళ్లు లేక కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, దీంతో రైతుల పైన ఆర్థిక భారం పడుతుందని హరీష్ రావు తెలిపారు. ఆరుగాలం శ్రమించి వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రంగనాయక సాగర్ లోకి వెంటనే ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని, ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను పరిష్కారించకుంటే పోరాటానికి సిద్ధమవుతామని ఆయన పేర్కొన్నారు. రైతుల పక్షాన అండగా నిలుస్తామని ప్రకటించారు. సిద్దిపేట రైతుల సమస్యలను లేవనెత్తుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి(Uttam Kumar Reddy) లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతంగ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని అంశాలను మంత్రి దృష్టికి తీసుకు వస్తున్నానన్నారు.