బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద ‘ఉగ్రరూపం’ చూపించడం ఖాయం. ‘సింహా’, ‘లెజెండ్’లను మించిన విజయాన్ని అందుకున్న‘అఖండ’కి.. సీక్వెల్‌గా వచ్చిన ‘అఖండ 2: తాండవం’ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో 3D హంగులతో థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చాలా విషయాలు పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన తన భయాన్ని కూడా వెల్లడించారు.
Also Read : Allu Arjun : బన్నీ-అట్లీ సినిమాకు ఇంటర్నేషనల్ టచ్
ఆయన మాట్లాడుతూ.. ‘ఈ విజయం మాకు ఎంత దక్కిన తక్కువ. ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాను. నిజం చెప్పాలంటే, ఈ సినిమా డబ్బుల కోసం చేసింది కాదు. అఖండ భారతం అంటే ఏంటి, మన ధర్మం ఏంటి, దేనికీ లొంగని మన శక్తి ఏంటి? అనే విషయాన్ని ప్రజలకు, ముఖ్యంగా నేటి తరం పిల్లలకు చేరువ చేయాలనే లక్ష్యంతో చేశాం. మేము ఎక్కడ మెసేజ్ ఇస్తున్నట్లు చెప్పకుండా, యువతను సీట్లకు కట్టిపడేసేలా అన్ని వాణిజ్య అంశాలను శక్తిమంతంగా చూపించే ప్రయత్నం చేశాం. ఈ కథను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా, ఆ సమయంలో నా భయమంతా కేవలం అభిమానుల గురించే! వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ సినిమా చూసిన చాలా మంది థియేటర్లలో లేచి దండం పెడుతున్నారు. ఆ దృశ్యం చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది’ అన్నారు.
ఈ చిత్రాన్ని ముఖ్యంగా పిల్లలకు 3Dలో చూపించాలని ఆయన కోరారు. అది వారికి చాలా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. మొత్తానికి, ‘అఖండ 2: తాండవం’ కేవలం సినిమాగా కాకుండా, మన సంస్కృతి, ధర్మం గొప్పదనాన్ని చాటి చెప్పే ఒక ప్రయత్నంగా విజయవంతమైందని, ఈ విజయం వెనుక బాలకృష్ణ గారు, అఖండ పాత్ర యొక్క శక్తి కారణమని ఆయన పేర్కొన్నారు.