శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త బొత్స సత్యనారాయణ కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బొత్స కుటుంబం విజయనగరంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. బొత్స కుటుంబంకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయగా.. సిరిమానోత్సవం ప్రారంభమైన కాసేపటికే వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో బొత్స కుటుంబ సభ్యులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిమానోత్సవ తిలకానికి ప్రత్యేకంగా అర్భన్ బ్యాంక్ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా కూలిపోయింది.
Also Read: Gudivada Amarnath: వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుంది.. ఎవరు అవుతారో చూస్తాం!
శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలడంతో ఎస్సై అశోక్, మరో చిన్నారికి గాయాలు అయ్యాయి. ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బొత్స కుటుంబ సభ్యులు కూర్చున్న ముందర వేదిక ఒక్కసారిగా కూలింది. దాంతో బొత్స, ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడికి సెక్యూరిటీ రాగా.. తనకు ఏమీ కాలేదని, కింద పడిన వారికి సాయం చేయండని బొత్స సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాసిరంకంగా వేదిక ఏర్పాటు చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. సిరిమానోత్సవానికి అనుగుణంగా ఏర్పాటైన వేదిక మౌలికంగా బలహీనంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని పలువురు విమర్శిస్తున్నారు.