Boiler Explosion: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి దాదాపు 15 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట, విజయవాడ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాయిలర్ పేలిన ఘటనలో క్షతగాత్రులను ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహంతో కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంపై దాడి ఘటనలో గ్రామస్థులు అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనా స్థలంలో విచారణ చేపట్టి పోలీసు వివరాలు నమోదు చేస్తున్నారు.
Read Also: Update On Murder Case : నిందుతుడి మానసిక పరిస్థితి బాగోలేదు.. మైనర్ బాలిక హత్య కేసు అప్డేట్..
ఈ ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ స్పందించారు. జగ్గయ్య పేట అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారంలో పేలుడుకు ప్రీ హీటర్ లోపమని ప్రాథమికంగా తేలిందని ఆయన వెల్లడించారు. అల్ట్రాటెక్ సంస్థ ప్రీ హీటర్‌ను జాగ్రత్తగా నిర్వహించడంలో విఫలమైందన్నారు. అందుకే ఎక్కువ వేడి ఉత్పన్నమయ్యి బాయిలర్ పేలిందని చెప్పారు. ఈ ఘటనలో తప్పిదం ఎవరిది ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికివ్వాలని అధికారులను ఆదేశించారు.