India Pak War : ఖంగున మోగే బాణాసంచా వెలుగులు, బంధుమిత్రుల సందడితో కళకళలాడుతున్న పెళ్లింట ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. గురువారం రాత్రి రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్‌అవుట్ కారణంగా జోధ్‌పుర్‌లోని పావ్టా ప్రాంతంలో జరుగుతున్న ఆ వేడుకలో ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వధూవరులు సప్తపది వేసే శుభఘడియకు సరిగ్గా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
అయితే, ఆటంకం ఎదురైనా ఆనందానికి అడ్డుకట్ట పడలేదు. పెళ్లికి వచ్చిన అతిథులంతా తమ సెల్‌ఫోన్ల టార్చ్‌లైట్లు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా ఒక కొత్త వెలుగును సంతరించుకుంది. ఆ వెలుగుల మధ్య, వధువు సిగ్గుతో తలవంచుకుని ఉండగా, వరుడు ఆమె చేయి పట్టుకుని ఏడడుగులు నడిచాడు.
Indian Air Force: పాక్ దాడిలో మరో భారత జవాన్ వీరమరణం..
ఆ తర్వాత పురోహితుడు మంత్రాలు చదువుతుండగా, ఆ సెల్‌ఫోన్ వెలుగులే వారికి దివ్వెల కాంతినిచ్చాయి. ఈ సంఘటనపై వరుడి కుటుంబసభ్యులు స్పందిస్తూ, దేశ భద్రత తమకు అత్యంత ముఖ్యమని, దాని ముందు మిగతావన్నీ చిన్నవేనని అన్నారు. ఆ చీకటిలో వెలిగిన వెలుగులు దేశభక్తికి, కర్తవ్య నిర్వహణకు ప్రతీకగా నిలిచాయి. విద్యుత్తు లేకపోయినా, ఆటంకాలు ఎదురైనా ఆ జంట ఒక్కటయ్యే శుభ ముహూర్తం ఆగలేదని, బంధువులంతా కలిసి వారిని ఆశీర్వదించారని అక్కడివారు తెలిపారు. ఆ పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ అసాధారణ సంఘటన అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
Pak Cyber Attack: భారత్‌పై సైబర్ దాడికి పాక్ ప్రయత్నం.. అప్రమత్తమైన కేంద్రం!