Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ హిట్లర్ ప్రచారం వ్యవస్థల పనిచేస్తోందని, అధికారంలో ఉన్న వారు గోమూత్రాన్ని మాత్రమే చూస్తారని ఆయన గురువారం అన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రైవేటీకరణ, తప్పుడు ప్రచారం చేయడం, ముస్లిం సమాజంపై ద్వేషాన్ని పెంచడం, దూకుడు జాతీయవాదం ఇది బీజేపీ ప్రధాన అంశాలని శరద్ పవార్ అన్నారు.
బీజేపీ అధికారంలో ఉంది, వారు దూకుడుగా ప్రచార వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఇది జర్మనీలోని హిట్లర్ ప్రచార వ్యవస్థలా పనిచేస్తోందని పవార్ అన్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని, దేశంలో బీజేపీకి అనుకూల వాతావరణం లేదని అన్నారు. ప్రధాని మోడీ కేవలం హామీలు మాత్రమే ఇస్తారని, వాటిని నెరవేర్చడం లేదని విమర్శించారు.
ఇదిలా ఉంటే పవార్ వ్యాఖ్యలకు శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ మద్దతు పలికారు. దేశం సైన్స్‌తో ముందుకు సాగుతుందని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రౌత్.. శరద్ పవార్ చెప్పనదాంట్లో తప్పు లేదని, ఈ దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య సాయంతోనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే, అది దేశాన్ని 5 వేల ఏళ్ల వెనకకు తీసుకెళ్లి, మతం ప్రాతిపదికన వివాదాన్ని సృష్టించాలనే కోరికను సూచిస్తుందని అన్నారు.